నందికొండ, జూలై 23 : గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో ఏకంగా పది అడుగల మేర తవ్వకాలు చేపట్టిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పది మంది కలిసి జట్టుగా ఏర్పడి అమావాస్య, పున్నమి రోజుల్లో తవ్వకాలు చేపడుతుండగా స్థానికుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్కాలనీకి చెందిన కోడ మల్లి, కోడ శ్రీను, కోడ సత్తి, కోడ నాగ అన్నదములు సోదరులు. వారంతా ఎస్బీఐ వెనుక కాలనీలో వరుసగా నాలుగు ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. కాగా, సత్తి ఇంట్లో కొద్ది నెలలుగా రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు.
కోడ మల్లి ఆధ్వర్యంలో ఆయన సోదరులు, హైదరాబాద్కు చెందిన కొందరు, తవ్వడానికి మరికొందరు మొత్తం పది మంది ఒక గ్రూపుగా ఏర్పడి తవ్వుతున్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా తవ్వేవారు. మిషన్లు కూడా వాడుతుండడంతో పెద్దపెద్ద శబ్ధాలు రావడం, నెలల తరబడి తవ్వకాలు కొనసాగుతుండడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సంపత్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఇంటి మధ్యలో పది అడుగుల లోతుకన్నా ఎక్కువ తవ్విన గుంత కనిపించింది. వచ్చిన మట్టి, రాళ్లు ఎవరికీ కనిపించకుండా మల్లి సోదరులు ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కవర్లు కట్టారు.
దాంతో పోలీసులు మల్లి సోదరులు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు, తవ్వడానికి వచ్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, కోడ మల్లి సోదరులు మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. తమ ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉందని, ఇంట్లో గజ్జెల చప్పుడు వస్తుండడంతో తవ్వకాలు చేపట్టామని ఓసారి.. కుటుంబ సభ్యులను అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతుండడంతో ఓ పూజారి చెప్పిన మేరకు తవ్వుతున్నామని మరోసారి తెలిపారు. మళ్లీ మాట మార్చి ఇంట్లో మరుగుదొడ్డి గుంతను తవ్వతున్నామని చెప్పుకొచ్చారు.