నల్లగొండ రూరల్, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ పార్టీది ప్రజా వ్యతిరేక పాలన అని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలు పేరుకుపోయాయని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్‌ను నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అభిమానులు, ఉద్యమకారులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
రజతోత్సవ వేడుకల విజయవంతానికి ఈ నెల 13 నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహస్తున్నట్లు తెలిపారు. 2001లో కేసీఆర్ ఒక్కడిగా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం లక్షల సైన్యాన్ని కదిలించారని గుర్తు చేశారు. 14 ఏండ్లు శ్రమించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. పదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటివెన్నో అమలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు.
కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని, నేటికీ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని విమర్శించారు. రూ. 15 వేల రైతు భరోసా, రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రూ.4 వేల పెన్షన్ హామీ నెరవెర్చలేదన్నారు. యాసంగికి సాగు నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయని, పండిన కొద్దిమేర ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నేటికీ చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు.
ప్రభుత్వం, మంత్రుల నిర్లక్ష్యంతో నల్లగొండ జిల్లాలో ఒక్కోరైతు వేల రూపాయాలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సైతం పలు సమస్యలపై ప్రజలు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎత్తడం లేదని, మంత్రి వెంట తిరుగుతూ జనం సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు లేక పాలన కుంటుపడిందని, కరెంట్ కోతలు మొదలయ్యాయని తెలిపారు.
సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మాజీ ఏఎంసీ చైర్మన్ బొర్ర సుధాకర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మ్న్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు కరీం పాషా, బొజ్జ వెంకన్న, నారబోయిన భిక్షం, తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, పీఏసీఏస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, రవీందర్, కొండూరు సత్యనారాయణ, గాదె రాంరెడ్డి, జమాల్ ఖాద్రీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, జయప్రద, విమలమ్మ, గుండెబోయిన జంగయ్య, సందీప్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, పేర్ల అశోక్, రమేశ్, నగేశ్, శ్రీనివాస్, జయపాల్ రెడ్డి, సైదులు పాల్గొన్నారు.