యాదాద్రి భువనగిరి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలను దగా చేస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించారని, ఇప్పుడు చట్టబద్ధత కల్పించకుండా మోసం చేస్తున్నదని విమర్శించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి జీవో అని, ఆర్డినెన్స్ అని, మరోసారి రాష్ట్రపతి, గవర్నర్కు పంపించామని డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తామని ప్రగల్బాలు పలికారని, కనీ సం కాంగ్రెస్ ధర్నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదని, రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఇకడే అర్థమవుతుందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇస్తామనడం దౌర్భాగ్యమన్నారు.
42శాతం రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకుంటుందని సాకు చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. రాష్ట్ర పరిధిలో ఉన్న హామీలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరి అమలు చేస్తామంటే ప్రజ లు నమ్మి ఓటేశారని.. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నా.. బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని, ఎన్ని కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పించారని అన్నారు. ఈనెల 14న కరీంనగర్లో బీసీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పాలనపై సొంత కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారని, అది ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కర్రె వెంకటయ్య, వస్పరి శంకరయ్య, గడ్డమీది రవీందర్ గౌడ్, జనగాం పాండు, ఓం ప్రకాశ్, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బోల్లేపల్లి రమేశ్, పుట్ట వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.