సూర్యాపేట, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకునే ఉన్నతాధికారులే కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల కేటాయింపుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. అర్హత ఉన్న ఏజెన్సీలను హోల్డ్‌లో పెట్టి, అధికార పార్టీ నాయకులకు దాసోహం అంటూ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని ఏజెన్సీలను అందలం వేస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను థర్డ్ పార్టీ కాంట్రాక్ట్(అవుట్ సోర్సింగ్) ఏజెన్సీలకు కేటాయిస్తుంటారు. జిల్లాలో ఏజెన్సీల కేటాయింపుల్లో పారదర్శకత పాటించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారులకు ఇష్టం ఉంటే అర్హత లేని ఏజెన్సీలను కూడా దొంగ దారిన తెచ్చి కేటాయించడం లేదంటే హోల్డ్‌లో పెట్టడం జరుగుతుంది.
నిబంధనల ప్రకారం ఏదైనా శాఖలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు కేటాయించాలంటే సదరు ఏజెన్సీకి ఫర్మ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, కాంట్రాక్ట్ లైసెన్స్‌తోపాటు ఆరు నెలల పాటు పీఎఫ్, ఈఎస్ఐ ఇచ్చి ఉండాలి. ఏజెన్సీ కచ్చితంగా రూ.25 లక్షల టర్నోవర్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఇవన్నీ ఉన్న పలు ఏజెన్సీలకు ఈసారి ఒక్క ఏజెన్సీ కూడా దక్కకపోవడం గమనార్హం. అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి అర్హత లేని ఏజెన్సీలకు కట్టబెట్టినట్లు తెలుస్తున్నది.
2023-24 సంవత్సరానికి సంబంధించి 2023 అక్టోబర్‌లో 40 ఏజెన్సీలు దరఖాస్తులు కొనుగోలు చేయగా అందులో మూడు ఏజెన్సీలు అసలు టెండర్లు వేయలేదు. మరో ఏజెన్సీ టెండర్‌తోపాటు డీడీ జత చేయకపోవడంతో రిజక్ట్ పొందలేదు. ఈ లెక్కన ఎంప్యానల్లో 36 ఏజెన్సీలే ఉండాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా టెండర్ వేయని నాలుగు ఏజెన్సీల నుంచి మధ్యలో డీడీలు తీసుకొని ఎంప్యానల్లో చేర్చారు. ఈ వ్యవహారంలో ఒక్కో ఏజెన్సీ నుంచి లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటికే ఉన్న కొన్ని ఏజెన్సీలను తొలగించి పైవాటిల్లో మూడు ఏజెన్సీలకు ఏకంగా పలు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈ విషయంపై అధికారులు అక్రమాలకు పాల్పడుతూ తమకు అన్యాయం చేశారని బాధితులు కోర్టు మెట్లు ఎక్కగా, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన కాంట్రాక్ట్‌లను రద్దు చేసి పాత వారినే కొనసాగించాలని ఉత్తర్వులు వచ్చాయి. అయినా అధికారుల్లో స్పందన లేదు.
2024-25 సంవత్సరానికి గానూ ఈ నెలలో టెండర్ ప్రక్రియను ప్రారంభించగా, ఎంప్యానల్లో 40 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను చూపిస్తున్నారు. వాస్తవానికి గతంలో టెండర్ వేయని ముగ్గురితో పాటు టెండర్లో పాల్గొని డీడీ జత చేయని ఏజెన్సీలను తొలగించి 36 మందితో ఎంప్యానల్ ఉండాల్సి ఉండగా, గత సంవత్సరం అర్హత పొందని నాలుగింటితో కలిపి మరో పదిహేను చేర్చారు. వీటిలో చాలా ఏజెన్సీలు నిబంధనల మేరకు లేవని తెలుస్తున్నది. కొన్నింటికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోగా, చివరి ఆరు నెలలపాటు పీఎఫ్, ఈఎస్ఐ ఇచ్చిన ఏజెన్సీలు కూడా లేవు. 25 లక్షల టర్నోవర్ సర్టిఫికెట్‌కు యూడీఐఎన్ నెంబర్ లేకుండా ఫేక్ సర్టిఫికెట్ పెట్టినట్లు ఘనులూ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అర్హత లేని ఏజెన్సీలకు కొన్ని బాధ్యతలు అప్పగించగా, మరికొన్ని అప్పగించేందుకు లావాదేవీలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.