యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎన్నికలను పాదర్శకం గా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అడిషన ల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్రావు తెలిపారు. తొలి విడతలోని ఆరు మండలాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తొలి విడత ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. తొలి విడతలో 153 సర్పంచ్లకు గాను 15 జీపీలు ఏకగ్రీవమయ్యాయని, మొత్తంగా 138 జీపీలు, 1197 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్న ట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉం టుందని, రెండు గంటల నుంచి ఫలితాలు వచ్చే వరకు లెక్కింపు ఉంటుందన్నారు. ఒక్క వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుందన్నారు.
బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు ఉంటాయని, సర్పంచ్ అభ్యర్థులకు తెలుపు, వార్డులకు సంబంధించి గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయని వివరించారు. తొలి విడతలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్స్లనే రెండు, మూడో విడత ఎన్నికల్లో వాడతామన్నారు. ఎన్నికల కోసం 126 ప్రైవేట్ బస్సులు, జోనల్ అధికారుల కోసం 38 తుఫాన్లు కేటాయించినట్లు తెలిపారు. మంగళవారం సా యంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుందన్నారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు.
1,62,401మంది ఓటర్లు..
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో 1,62,401మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందు లో 80,497 పురుషులు, 81,902 మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారని భాస్కర్రావు పేర్కొన్నారు. ఆలేరులో 21,537, రాజాపేటలో 30,236, యాదగిరిగుట్టలో 27615, ఆత్మకూరు (ఎం)లో 25,533, బొమ్మలరామారంలో 29,503, తుర్కపల్లిలో 27,977 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ఓటర్లలో చైతన్యం పెంచేందుకు అన్ని రకాల చర్య లు చేపట్టామన్నారు. గత పంచాయతీ ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఓటు వినియోగానికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.
విధుల్లో 3 వేల మంది సిబ్బంది..
మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధు ల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈనెల 10న మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలో అదే రోజు చెప్తామన్నారు. ఉద్యోగులకు సొంత మండలంతోపాటు ఉద్యోగం చేసే ప్రాంతంలో విధులు ఉండవన్నారు. ఉద్యోగులకు 52 రకాల మెటీరియల్ ఉండే బ్యాగులు ఇస్తామని, అందులో గోనె సంచులు మొదలుకొని ఎన్నికల ఫారాల వరకు ఉంటాయన్నా రు. 14 పోలింగ్ కేం ద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉం టుందని, ఆత్మకూరు(ఎం)లో ఏడు, రాజాపేట మండలంలో ఏడు చొప్పున ఉంటాయన్నారు. తొలి విడతలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు లేవని, 52 సున్నితమైన సెంటర్లు ఉన్నాయని వివరించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్న రెండు, మూడు పంచాయతీలకు కలిపి పోలీస్ పెట్రోల్ వాహ నం గస్తీ నిర్వహిస్తుందన్నారు. ఈనెల 17 వర కు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు.