నీలగిరి, నవంబర్ 27 : బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. సీడబ్ల్యూసీ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకి వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యంలో వివాహాలు చేసుకోవడం ద్వారా కలిగే నష్టాలపై, అదేవిధంగా పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. అనంతరం బాలల హక్కులను కాపాడడం, బాల్య వివాహాలను అరికట్టడంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ చింతా కృష్ణయ్య, బాలల పరిరక్షణ అధికారి కాసాని గణేశ్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Nilagiri : బాల్య వివాహాల నిర్మూలనకి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : డీఎస్పీ శివరాం రెడ్డి