త్రిపురారం, మే 27 : టీబీ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నల్లగొండ జిల్లా త్రిపురారం పీహెచ్సీ వైద్యుడు మాలోతు సంజయ్ అన్నారు. మంగళవారం స్థానిక పీహెచ్సీలో వంద రోజుల టీబీ క్యాంప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామగ్రామాన టీబీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేవలం దగ్గు ఒక్కటే టీబీ లక్షణం కాదని, ఛాతిలో నొప్పి, చెమటతో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడడం, అలసట, నీరసం, గతంలో ఆరోగ్య సమస్యలు, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు రావడం, శరీరంలో ఏ భాగంలోనైనా వాపు రావడం ఇలాంటి లక్షణాలు ఉన్న ఎవరైనా టీబీ పరీక్ష చేయించుకోవాలన్నారు.
టీబీ వ్యాదిపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పట్ట గోపాల్‌రెడ్డి, కమలమ్మ, టీబీ సూపర్వైజర్ నాగిరెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ వాసుదేవరెడ్డి, సిబ్బంది నూర్జహాన్, యాదమ్మ, గౌతమి, హైమావతి, నలినికాంత్ పాల్గొన్నారు.