సూర్యాపేట, అక్టోబర్ 24 : అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యూలు కావాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురాడం అభినందనీయమన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛభారత్ ఒక ఉద్యమమని, జిల్లాలోని ప్రముఖులను అందులో భాగస్వాములను చేయాలని సూచించారు. 475 గ్రామ పంచాయతీలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
సూర్యాపేట జిల్లాను దారిద్ర రేఖ నుంచి పైకి తీసుకొచ్చే లక్ష్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు భాగస్వాములు అవ్వాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో జిల్లా మెరుగైన స్థానంలో ఉందన్నారు. విద్యార్థులకు తరగతి గదిలో చదువుతోపాటు చేతి వృత్తుల్లో చిన్న చిన్న వస్తువులు, పరికరాల తయారీ వంటివి నేర్పించాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని గవర్నర్ మెచ్చుకున్నారు. భవిష్యత్ అభివృద్ధి మహిళా సాధికారతపైనే ఆధారపడి ఉందన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన సందర్భంగా ఆయా సంఘాల మహిళలు తయారు చేసిన చేతి వృత్తులను చూసి అభినందించారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, న్యాయవాదుల కృషిని తెలుసుకున్నారు. అనంతరం వారిని శాలువ, జ్ఞాపికతో సన్మానించారు.
వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ అన్నారు. తలసరి ఆదాయంలోనూ ముందు ఉందన్నారు. ప్రత్యేకించి ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా, సైన్స్ రంగాల్లో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదన తెలిపారు. ఆహార భద్రతలో భాగంగా దారిద్రరేఖకు దిగువున ఉన్న ప్రజలకు మెరుగైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో జనవరి నుంచి సన్న బియ్యం అందించనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ జిల్లాలో ముఖ్యమైన ప్రార్ధనా మందిరాలతోపాటు గ్రామీణాభివృద్ధి, విద్య, వై ద్యం, వ్యవసాయం, ఉద్యానం, సంక్షేమం, నీటి పారుదల, విద్యుత్, పౌర సరఫరాలు, తదితర శా ఖల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, జాయింట్ సెక్రటరీ భవానీశంకర్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్లు అన్నపూర్ణ, అనసూయ, గెల్లి అర్చనతోపాటు జిల్లా అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు.