కోదాడ, జులై 01 : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ప్రముఖ సీనియర్ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావును బుధవారం స్థానిక ఎస్ఆర్ఎం సంకల్ప్ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని వారి ఆస్పత్రికి వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులు డాక్టర్లకు పుష్పగుచ్ఛం అందించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి సుబ్బారావు విద్యార్థులతో ముచ్చటించారు. సమాజంలో వైద్య వృత్తికి ఉన్న ప్రాధాన్యతను, ప్రజలకు అందించే సేవల గురించి వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని, చిన్నతనం నుంచే మంచి లక్ష్యాలను ఏర్పరచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్లో దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.