న్యూఢిల్లీ, జూలై 19: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పురస్కరించుకుని కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని ఇండియా కూటమి ఎంపీలు బహిష్కరించారు. తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలకు పార్లమెంట్లో వేరుగా ప్రత్యేక సీట్ల కేటాయింపును నిరసిస్తూ తాము సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టు ప్రకటించారు. కొద్దిసేపటికి సమావేశానికి తిరిగి హాజరైన ఎంపీలు ప్రతీకాత్మక నిరసనగా తాము వాకౌట్ చేసినట్టు తెలిపారు. పార్లమెంట్ అనుబంధ భవనంలో ఆదివారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వ ప్రధాన అజెండాలపై చర్చించడానికి అన్ని ప్రధాన పార్టీల సభాపక్ష నాయకులు హాజరయ్యారు.
అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇండియా (ఎన్సీపీఐ) పేరిట హాజరైన 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు సమావేశంలో ప్రత్యేక టేబుల్ కేటాయించడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెబల్ పార్టీ ఎంపీలను ప్రత్యేక పార్లమెంటరీ పార్టీగా ఇంకా గుర్తించకుండానే వారికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయడాన్ని విపక్ష ఎంపీలు తప్పుబట్టారు. 20 మంది ఎంపీల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉండగా, వారిని ప్రత్యేక వర్గంగా ఎలా గుర్తిస్తారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ, శివసేన ఎంపీ ఎన్డీ గుప్తా తదితరులు ప్రశ్నించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 40 పార్టీల నేతలు పాల్గొన్నారు. సమావేశంలో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని, పార్లమెంట్ సమావేశాలను ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించుకోవడం అందరి బాధ్యతని కిరణ్ రిజిజు సమావేశం అనంతరం తెలిపారు.