చదువుతోపాటు యువత అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో తన సొంత ఖర్చులతో నియోజకవర్గానికి చెందిన యువత, పిల్లలకు సోమవారం క్రీడా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. క్రీడా కిట్లను సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
– సూర్యాపేట టౌన్, మే 21
సూర్యాపేట టౌన్, మే 21 : యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంత్రి సొంత ఖర్చుతో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా యువత, చిన్నారులకు సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో క్రీడాకిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతమిస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల క్రీడాకారులను ప్రోత్సహించి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభకు పదును పెట్టి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. వివిధ క్రీడా పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది కావాలని అన్నారు. గతంలో సూర్యాపేట వేదికగా జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించి విజయవంతం చేశామన్నారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను సూర్యాపేట వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని, యువత తమకు వచ్చిన క్రీడలో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకే క్రీడా కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సూర్యాపేట పట్టణంతోపాటు మండలాల్లోని వివిధ గ్రామాల యువకులకు క్రీడా సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల యూత్ నాయకులు కనుకు రేణుక, వెంకటేశ్, రాజేశ్, అనిల్, మవీన్, శ్రీకాంత్, మహేశ్ పాల్గొన్నారు.
దివ్యాంగుడికి మంత్రి చేయూత..
ప్రమాదవశాత్తు కాలు పోగొట్టుకున్న దివ్యాంగుడికి మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.1.25లక్షలతో కృత్రిమ కాలును అందజేశారు. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గదగాని భిక్షపతి ప్రమాదవశాత్తు కాలు పోగొట్టుకోగా ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయించి ఇంపోర్టెడ్ కాలును తెప్పించి ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అందించారు.
మంత్రిని కలిసిన ఎమ్మార్పీఎస్‌టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి
ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు పడిదల రవి, మరికంటి అంబేద్కర్, రాష్ట్ర కార్యదర్శి పల్లేటి లక్ష్మణ్, కనుకు జానయ్య, బొజ్జ పరశురాములు ఉన్నారు.