రామగిరి, మార్చి 8 : విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా యూనిఫామ్స్ అందిస్తుండగా వాటిని ముందస్తుగానే తయారు చేసే విధంగా చర్యలు చేపట్టింది. ఏప్రిల్‌లో బడులు ముగిసే నాటికి యూనిఫామ్ క్లాత్‌ను తెప్పించి వేసవి సెలవుల్లోనే కుట్టే విధంగా ప్రణాళిక రూపొందించింది. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నది.
2024-25 సంవత్సరానికి బాలికలు, బాలురకు వివిధ రకాల డిజైన్లలో యూనిఫామ్స్‌ను స్టిచ్చింగ్ చేయించేందుకు సిద్ధమవుతున్నది. ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,110 ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ పాఠశాలల్లో 1.87,765 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సంబంధించి 11,38,788.75 మీటర్ల యూనిఫామ్ క్లాత్ అవసరం ఉండగా రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) నుంచి సరఫరా చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు రూ.1,87,76,600 మంజూరు చేసింది.
స్టిచ్చింగ్ బాధ్యతలను ఈ పర్యాయం సమభావన సంఘాలకు అప్పగించారు. జిల్లా కేంద్రాలకు చేరిన క్లాత్‌ను విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మండలాల్లోని ఎంఆర్సీలకు చేరవేస్తారు. ఎంఈఓలు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించగానే వాటిని సమభావన సంఘాలకు ఇచ్చి విద్యార్థులకు కొలతల ప్రకారం కుట్టించనున్నారు. ప్రతి విద్యార్థికి రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ అందించనున్నారు.
