సూర్యాపేట, జూన్ 27 : హరితహారంలో నాటే మొక్కలు పర్యావరణ పరిరక్షణతోపాటు ఆదాయ మార్గంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. సాగునీటి కాల్వల వెంట హరితహారం మొక్కలు నాటి గ్రామ పంచాయతీలకు ఆదాయం కల్పించేలా ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎస్పారెస్పీ, నాగార్జున సాగర్, మూసీ కాల్వల వెంట ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలాల్లో మొక్కలు పెంచనున్నారు. అందుకోసం సూర్యాపేట జిల్లాలో 115 చోట్ల 224 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. టేకు, వెదురు, పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో నాటనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన హరితోత్సవంలో నాగారం మండలం ఈటూరు వద్ద వన సంపద కార్యక్రమాన్ని ఇప్పటికే మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.
హరితహారంలో నాటే మొక్కలు గ్రామ పంచాయతీలకు ఆదాయ మార్గంగా ఉండాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం వన సంపదలను తయారు చేయనున్నది. ఇరిగేషన్ శాఖ కాల్వల వెంట వనాలు ఏర్పాటు చేసి వాటి నుంచి ఆదాయం పొందే విధంగా పెంచనున్నది. జిల్లాలోని ఎస్పారెస్పీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, మూసీ కాల్వ వెంట ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలాల్లో వీటిని పెంచనున్నారు. ఇప్పటికే 11 మండలాల పరిధిలో 115 చోట్ల 224 ఎకరాల స్థలాలను గుర్తించిన అధికారులు అందులో టేకు, వెదురు, పండ్ల మొక్కలను నాటనున్నారు. వాటి అమ్మకాల ద్వారా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చే విధంగా వనాలను సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నాగారం మండలం ఈటూరు వద్ద వన సంపద కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భూముల పరిరక్షణ..
కాల్వల నిర్మాణ సమయంలో ప్రభుత్వం కాల్వలకు ఇరువైపులా 100 నుంచి 50 అడుగుల వెడల్పులో భూమిని కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఆ భూముల రక్షణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిపోతున్నది. దీంతో వాటిని సంరక్షించడంతో పాటు అందులోనే హరితహారం మొక్కలు నాటేలా జిల్లా యంత్రాంగం గత హరితహారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. 8వ విడుత హరితహారంలో దాదాపు 20 లక్షల మొక్కలు నాటారు. 9వ విడుత హారితహారంలో సైతం మిగిలిన ప్రాంతాల్లో మరో 1.50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో ఆదాయం వచ్చే టేకు, వెదురు, పండ్ల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 మండలాల పరిధిలో 115 చోట్ల 224 ఎకరాలను గుర్తించిన అధికారులు అందులో ఈ మొక్కలు నాటనున్నారు.
8వ విడుత హరితహారంలో 20 లక్షల మొక్కలు..
కంప చెట్లతో కూడి మనిషి నడవడానికి సైతం వీలుపడని కాల్వలపై మొక్కలు పెంచి ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఇరిగేషన్ కాల్వల వెంట పల్లె ప్రకృతి వనాలు, మెగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూసీ, ఎస్పారెస్పీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వల వెంట 80 శాతం బౌండరీలను గుర్తించడం పుర్తయింది. దాదాపు 800 ఎకరాల భూమిలో 350 పల్లె ప్రకృతి వనాలు, 130 మెగా పల్లె ప్రకృతి వనాలను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా బౌండరీ తక్కువగా ఉన్నచోట రెండు లేదా మూడు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ఇరిగేషన్ భూముల్లో సుమారు 20 లక్షల మొక్కలు నాటడం జరిగింది.
గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం..
గతంలో చెరువుల్లో తుమ్మ చెట్లు వేసి వాటి అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయం పొందేవి. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ ల్యాండ్‌లో టేకు, వెదురు, పండ్ల మొక్కలు నాటి వాటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఆ పరిధిలోని గ్రామ పంచాయతీకి చెందేలా పంచాయతీకి అప్పగించనున్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీ తీసుకోనున్నది. అవి వృక్షాలుగా మారిన తర్వాత అమ్మి ఆదాయం సమకూర్చుకోనున్నది.