భువనగిరి అర్బన్, డిసెంబర్ 7 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని కార్యాలయంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ఎరుకల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. హైదరాబాద్ నిజాంపేటలో ఎరుకల ఆత్మగౌరవ భవనం పూర్తి, ఎరుకల కుటుంబాలకు ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్, చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ప్రకటించిన ప్రకారం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయింపు, భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో జరిగే ఎరుకల నాంచారమ్మ జాతరకు రూ.10 లక్షల బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతడి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కోనేటి నర్సింహ, రాష్ట్ర కోశాధికారి వనం రమేష్, జిల్లా అధ్యక్షుడు కూతడి సురేశ్, నాయకులు రాజశేఖర్, యాదగిరి పాల్గొన్నారు.