మిర్యాలగూడ, అక్టోబర్ 29 : రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో 163 యాక్ట్‌ను అమలు చేయడం చూస్తుంటే శాంతిభద్రతలు లోపించినట్లు అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం అభద్రతా భావంతో ఉందని, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. హక్కుల సాధన కోసం పోరాడుతున్న స్పెషల్ పోలీసులను 39 మందిని సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
హైడ్రా అనేది అనాలోచిత నిర్ణయమని, ధనికులకు ఒక విధంగా, పేదలకు ఒక విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ధనికుల ఇండ్ల జోలికి వెళ్లకుండా పేదల ఇండ్లను మాత్రమే కూలగొడ్తున్నారని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో విద్యుత్ చార్జీలు ఎన్నడూ పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది నెలలు అయినా విద్యుత్ చార్జీలు పెంచాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు లేఖలు రాసిందన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారని, వారు ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకున్న ఈఆర్సీ చైర్మన్ చార్జీల పెంపును విరమించుకున్నారని చెప్పారు. అన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమన్నారు. చార్జీల పెంపును విరమించుకున్నందున ఈఆర్సీ చైర్మన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.