బొడ్రాయిబజార్, ఏప్రిల్ 22 : 2022-23లో మహిళా స్నేహ పూర్వక విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డుకు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామం ఎంపికై ఇటీవల జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సర్పంచ్ సానబోయిన రజితాసుధాకర్, గ్రామ కార్యదర్శి ఉమారాణి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని సర్పంచ్ రజిత, కార్యదర్శి ఉమారాణి మర్యాదపూర్వకంగా కలిసి అవార్డు, ప్రశంసాపత్రాన్ని చూపించారు. తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న ఏపూరు గ్రామం జాతీయ స్థాయిలో ఎంపికవడం ఆనందంగా ఉందని సర్పంచ్, సెక్రటరీని మంత్రి అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణగౌడ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రారెడ్డి, సుధాకర్, ప్రసాద్, జానయ్య పాల్గొన్నారు.