ఆత్మకూర్ ఎస్, మార్చి 11 : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏపూరు శుభసముద్రం చెరువు తూమును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీరు గడిచిన ఐదు రోజులుగా వృథాగా పోతుంది. చెరువు తూముకు ఉన్న తలుపులను, ఇనుప ప్లేట్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. ఒకవైపు గోదావరి జలాలు సక్రమంగా అందక, చెరువుల్లో నీరు లేక సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో శుభసముద్రంలోని నీరు ఇలా వృథాగా పోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల కాంట్రాక్టర్లపై వారు అనుమానం వ్యక్తం చేశారు.
కొద్దిపాటి నీటితోనైనా భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయనుకుంటే చెరువు తలుపులను ధ్వంసం చేసి నీటిని వృథాగా ఏట్లోకి వెళ్లేలా చేసినట్లు రైతులు వాపోయారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కరించడం లేదని గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ గౌస్ ఆరోపించారు. తూమును వెంటనే మూసివేయకపోతే మరో రెండు మూడు రోజుల్లో చెరువులోని నీరు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు.