బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
చందంపేట(నేరెడుగొమ్ము), సెప్టెంబర్ 21 : కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోయిన జనం.. మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం నేరెడుగొమ్ము మండలంలోని ధర్మ రేక్యాతండాకు చెందిన సుమారు వంద మంది వేర్వేరు పార్టీల కార్యకర్తలు రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, రైతులు యూరియా కోసం గగ్గోలు పెడుతున్నారని,విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజా పాలన అని ఎన్నికల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందన్నారు.
సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబతారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు సత్తా చాటి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కేతావత్ శ్రీను, ముడావత్ మున్యా, కేతావత్ మోహన్, లోకేష్, బాగురోజి, అంజి, హరి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బషీర్, బీఆర్ఎస్వీ నాయకుడు అభిషేక్ నాయక్, చెన్నానాయక్, కృష్ణ, రాజు తదితరులు ఉన్నారు.