రామగిరి, జులై 10 : మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని సూచించారు. ఎంజీయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్- 5 ఆధ్వర్యంలో గురువారం యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. గతంలో యూనివర్సిటీలో నాటిన మొక్కలు నేడు పెరిగి పచ్చదనం సంతరించుకుందన్నారు. దీంతో యూనివర్సిటీ ఆహ్లాదకరంగా కనిపిస్తున్నట్లు చెప్పారు.
నాటిన ప్రతి మొక్కను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీసీ సతీమణి, ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం అసోసియేట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ బేగం, రిజిస్టర్ అల్వాల రవి, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ప్రోగ్రాం అధికారి డాక్టర్ నీలకంఠం, శేఖర్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.