– ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ, డిసెంబర్ 29 : రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని భారీగా వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, చిట్యాల–పెద్ద కాపర్తి మధ్య జాతీయ రహదారి–65పై జరుగుతున్న ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, రహదారిపై ప్రయాణించే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. జరుగుతున్న పనులు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, వాహనాల రాకపోకలను సమీక్షించారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్లపైకి మళ్లించడం వల్ల కొన్ని చోట్ల గుంతలు ఏర్పడి రోడ్లు దెబ్బతిన్నాయని, ఇది వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోందని గమనించిన ఎస్పీ ప్రమాదాలను నివారించడానికి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలలో తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీ సమయాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని మోహరించాలని, అవసరమైన చోటల్లా మళ్లింపు మార్గాల కోసం స్పష్టమైన సూచికలు ఏర్పాటు చేయాలన్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి అయ్యేలా, ప్రజల ఇబ్బందులు తగ్గేలా సంబంధిత రహదారులు, భవనాల శాఖ అధికారులు.. కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి, పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా జిల్లా పోలీసు శాఖ సమగ్ర భద్రత, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లు చేస్తోందని ఆయన వెల్లడించారు.

Nalgonda : ‘చిట్యాల–పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణం వద్ద ట్రాఫిక్ సజావుకు ప్రత్యేక చర్యలు’