నల్లగొండ జిల్లాలో పంచాయతీ విభాగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారాయి. జిల్లా ఉన్నతాధికారులకు, ఆ శాఖలోని అధికారులు, సిబ్బందికి మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం తాజాగా పలువురి సస్పెన్షన్లతో రచ్చకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లకు నిధులు రాలేదు. ముఖ్యంగా పంచాయతీలు, మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన మొదలైన నాటి నుంచి ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా సొంత డబ్బులతో నెట్టుకొస్తున్నామని, తీవ్ర పని ఒత్తిళ్లను తట్టుకుని ప్రభుత్వ లక్ష్యాల కోసం కృషి చేస్తున్నామని పంచాయతీ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. అయినా జిల్లా ఉన్నతాధికారులు టార్గెట్లు విధిస్తూ, పర్యవేక్షణ పేరుతో ఇతర శాఖల అధికారులకు పెత్తనం అప్పగిస్తున్నారని, చిన్నచిన్న కారణాలకే స్పస్పెండ్ చేస్తూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ మూకుమ్మడి సెలవులకు దిగారు. బుధవారం పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు వేర్వేరుగా తామంతా సామూహిక సెలవులో వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ అడ్రెస్‌తో వినతిపత్రాలు సమర్పించి విధులను బహిష్కరించారు. ఈ పరిణామాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.
– నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్25(నమస్తే తెలంగాణ)/నీలగిరి
ఇతర కారణాలతో ఉన్నతాధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని కార్యదర్శులు సంచలన నిర్ణయానికి వచ్చారు. జిల్లాలోని గుర్రంపోడ్ ఎంపీడీఓ, మరో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ సస్పెండ్ చేయడంతో ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు సాముహిక సెలవుకు వెళ్లారు. ఆ మేరకు బుధవారం జిల్లా అంతటా సెలవులు పెడుతూ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు లేఖలు ఇచ్చారు. జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల పదవి కాలం ముగిసిపోవడంతో పల్లెల్లో పరిపాలన సౌలభ్యం కోసం ఇతర శాఖల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అంతేగాక క్షేత్రస్థాయిలో పనులు సక్రమంగా జరిగేందుకు, వాటిని తనిఖీలు చేసేందుకు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులను మండల సూపర్వైజరీ అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పల్లెల్లో పాలనపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేస్తున్నది. గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీరు, మొక్కల పెంపకం, కంపోస్ట్ షెడ్ నిర్వహణ వంటి కారణాలను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలో క్షేత్రస్థాయి పాలన వ్యవహారాల్లో కీలకమైన గ్రామ, మండల పరిషత్ విభాగంలో 9 నెలలుగా నిధుల రాక అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడా కొంతమంది అధికారులు సొంత నిధులు వెచ్చించి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కలెక్టర్ వీడియో కాన్సెరెన్స్ నిర్వహించి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ గుర్రంపోడ్ ఎంపీడీఓ, విధులకు హాజరు కాని పులిచర్ల పంచాయతీ కార్యదర్శి, పారిశుధ్యం క్రిమిటోరియం సక్రమంగా లేదని వాచ్యాతండా కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులంతా బుధవారం నుంచి సామూహిక సెలవుల్లోకి వెళ్లారు. ఇందుకు సంబంధించి వేర్వురుగా ఆయా సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు తమ సామూహిక సెలవుల వినతిపత్రాలను అందజేశారు. దాంతో జిల్లావ్యాప్తంగా గ్రామాలు, మండలాల్లో పాలన వ్యవస్థ స్తంభించింది. వర్షాలు పడుతున్న వేళ సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండగా జిల్లా ఉన్నతాధికారులు, పంచాయతీ విభాగం అధికారులకు మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. కాగా, అప్పటికే వచ్చిన ఆదేశాల మేరకు బుధవారం నుంచి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మూడు రోజుల పాటు మహారాష్ట్ర పర్యటనలో ఉండడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. అప్పటి నుంచి గ్రామపంచాయతీలకు నిధులు రాలేదని, అయినా నిర్వహణ తామే చేపడుతున్నామని పంచాయతీ కార్యదర్శుల జేఏసీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తామే అప్పులు చేసి తాగునీటితో పాటు పారిశుధ్య చర్యలు, వీధిదీపాల నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. తమకు రావాల్సిన డబ్బులను తక్షణమే చెల్లించాలని కోరారు. బీఎల్ఓలు నిర్వర్తించాల్సిన విధులను సైతం తమతో చేయించడం సరికాదంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన హారితహారం మొక్కల లెక్కల వివరాలపై ఇప్పుడు ఆరా తీయడమంటే తమను బ్లాక్మెయిల్ చేయడమేనని చెప్తున్నారు. ఇలా పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ అకారణంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ బిల్లులతోపాటు పని ఒత్తిడి తగ్గించాలని, అకారణంగా సస్పెండ్ చేసిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సామూహిక సెలవుల్లో వెళ్తున్నట్లు అన్ని మండలాల్లో ఎంపీడీఓలకు కార్యదర్శుల జేఏసీ లేఖలను అందజేసింది. ఇదే సమయంలో మండల పంచాయతీ అధికారులు సైతం నిధులు లేకున్నా సాధ్యమైంత వరకు ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తున్నామని, అయినా ఉన్నతాధికారులు వివిధ రకాలుగా ఒత్తిడికి గురిచేస్తున్నారంటూ సామూహిక సెలవు పెట్టారు. తక్షణమే తమ విభాగంలో సస్పెన్షన్లను ఎత్తివేయాలని, తమపై ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణను తొలగించాలని, నిధులు విడుదల చేస్తూ పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంపీడీఓ సంఘం ఆధ్వర్వంలోనూ సామూహిక సెలవు కోరుతూ కలెక్టర్‌కు లేఖ పంపించారు. గ్రామ పంచాయతీల్లో నిధుల లేమి, పని ఒత్తిడి, అకారణ సస్పెన్షన్ల ఎత్తివేత, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం డిమాండ్లతో నిరసనకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరుకాకూడదని నిర్ణయించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా యంత్రాంగం క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం సహజం. జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం రెండు వారాల క్రితం మండల సూపర్వైజరీ అధికారులను నియమించి పల్లెలో సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. కానీ ఇతర శాఖల అధికారుల ఒత్తిడి అంటూ పంచాయతీ విభాగం అధికారులు, సిబ్బంది సాముహిక సెలవులు పెట్టారు. దీనిపై సంబంధిత సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి డిమాండ్లను జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
– పూర్ణచంద్ర, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్