రామగిరి, జూన్ 25 : ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా ఆయా పాఠశాలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ 6 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన బడిబాటలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 26,660 మంది నూతన విద్యార్థులు చేరినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే నెలవరకు నూతన అడ్మిషన్లకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
– నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1,530 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు -1,128, యూపీఎస్లు 128, ఉన్నత పాఠశాలలు – 229, కేజీబీవీ 27, మోడల్ స్కూల్స్ – 17, యూఆర్ఎస్-01 ఉన్నాయి. వీటిలో ఈ నెల 25వరకు 10,512 మంది నూతన విద్యార్థులు చేరగా 1వ తరగతిలో 4,419, రెండు నుంచి 10వ తరగతి వరకు 6,093 మంది చేరినట్లు అధికారులు తెలిపారు.
– సూర్యాపేట జిల్లాలో 7,438 మంది నూతన విద్యార్థులు చేరగా వీరిలో 1వ తరగతిలో 2,542, రెండు నుంచి 10వ తరగతి వరకు 4,896 మంది ఉన్నారు.
– యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,710 అడ్మిషన్లు కాగా వీరిలో 1వ తరగతిలో 2,499, రెండు నుంచి 10వ తరగతి వరకు 6,211 మంది ఉన్నారు.