School Fees : నేటి కాలంలో విద్యార్థుల స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు భారంగా మారాయి. నిన్నటితరం వాళ్లు కేజీ నుంచి పీజీలు, పీహెచ్డీలు పూర్తి చేసేందుకు చెల్లించిన ఫీజుల కంటే ఎక్కువగా ఇప్పటి తరంలో ఒక సంవత్సరానికే చెల్లించాల్సి వస్తోంది. ఇందుకు నిదర్శనం ఈ ఘటన. ముంబైలోని ఒక స్కూల్లో యూకేజీ ఫీజు అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు. ఈ విషయాన్ని ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. అవిరల్ భట్నాగర్ అనే వ్యక్తి బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఇప్పుడు ఒక సంస్థను స్తాపించాడు.
అతడు ఫీజుల అంశంపై సోషల్ మీడియాలో స్పందించాడు. ముంబైలో తన కజిన్ కూతురు యూకేజీ ఫీజు నాలుగు లక్షల రూపాయలని, బాంబే ఐఐటీలో తన నాలుగేళ్ల చదువుకు మొత్తం కలిపి అందులో సగమే అయిందని చెప్పాడు. చదువు చాలా ఖరీదైందని, ఖర్చులు బాగా పెరిగిపోయాయని, కానీ, మనం వాటి గురించి మాట్లాడటం లేదన్నాడు. అయితే, రాబోయే ఏఐ టెక్నాలజీ ఈ చదువును అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ అంశంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది చదువుకు సంబంధించిన ద్రవ్యోల్బణం కాదని, స్టేటస్ మాత్రమే అని కొందరు నెటిజన్లు అంటున్నారు.
Cousin told me her daughter’s UKG fees is crossing 4L/yr in Mumbai
My fees at IIT Bombay was half that for the entirety of the 4 years
Education costs are the hidden inflation that no-one is talking about
Perhaps AI tutors will make it affordable again
— Aviral Bhatnagar (@aviralbhat) February 18, 2026
ఏడాదికి నాలుగు లక్షలు ఫీజు వసూలు చేసే స్కూలుకు పిల్లల్ని పంపాల్సిన అవసరం లేదంటున్నారు. దేశంలో చదువు, పెళ్లి, వైద్యం మూడు అత్యంత ఖరీదైన, లాభదాయకమైన వ్యాపారాలని మరో నెటిజన్ రియాక్టయ్యారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య సంస్థల సేవలు ఘోరంగా ఉండటం వల్ల ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు నడుస్తున్నాయని, ఇవి ధనవంతులకు మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు. ఇలా పెరిగిపోతున్న ఫీజుల అంశంపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.