వచ్చే ఎన్నికల్లో మరోసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ విజయాన్ని పరిపూర్ణం చేసే దిశగా గులాబీ నేతలు మరింత దూకుడును పెంచారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టారు. దాంతో ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులంతా నిత్యం ప్రజల్లోనే ఉంటుండడంతో కోలాహలం నెలకొన్నది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై వారు దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమ, పార్టీని నడిపించే విధానం, పాలన సమర్థత, పథకాల అమలు లాంటివన్నీ విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను బీఆర్ఎస్ వైపు చూసేలా చేస్తున్నాయి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాల వారీగా గులాబీ కండువాలు కప్పుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దాంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో నిత్యం బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కొన్నిచోట్ల, బీజేపీ జిల్లా అంతటా బలమైన అభ్యర్థుల వెతుకులాటలోనే ఉండడంతో ఆయా పార్టీల్లో నిస్తేజం కనిపిస్తున్నది. ఇక ఉన్న నేతల్లో సైతం ఆధిపత్య పోరుతో క్యాడర్ బేజారైపోతున్నది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి పరిస్థితి ఏమిటన్న మీమాంసతో బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థులను గత నెల 21న ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే గెలుపు గుర్రాలుగా భావిస్తూ వారికే మరో అవకాశం కల్పిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వివిధ సర్వేలు, అంచనాలు, పార్టీ క్యాడర్ అభీష్టం, ఆయా నియోజకవర్గాల ఓటర్ల మనోగతాన్ని పరిగణలోకి తీసుకొనే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ప్రకటన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ మరింత దూకుడు పెంచింది. అభ్యర్థుల ప్రకటన రోజే పార్టీ శ్రేణులంతా అధినేత నిర్ణయానికి సమ్మతి తెలియజేస్తూ అభ్యర్థ్ధిత్వాలను స్వాగతిస్తూ గ్రామగ్రామాన సంబురాలు జరిపాయి. ఆ తర్వాత జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎన్నికల నాటికి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. టికెట్ కేటాయింపు అనంతరం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తొలిసారి పర్యటనలను భారీ ర్యాలీలు, రోడ్‌షోలతో శ్రేణులు ఫుల్ సందడి చేశాయి. దీంతో ఆ రోజు నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులంతా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ క్యాడర్‌తో మమేకం అవుతున్నారు. ఓవైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటూనే మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను నిత్యం పర్యవేక్షణలు, సమీక్షలు చేస్తూ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఇక 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో గ్రామాల వారీగా చేపట్టిన కోట్లాది రూపాయల పథకాలను మరోసారి ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలి ఉన్న పనులను పూర్తి చేసే బాధ్యత తమదేనన్న భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల కుట్రలను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి గ్రామాల వారీగా నిత్యం వందలాది మంది బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కొన్నిచోట్ల గ్రామాలకు గ్రామాలే కదలివచ్చి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో వలసలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Brs
నిత్యం భారీగా చేరికలు
ఉమ్మడి జిల్లా అంతటా బీఆర్ఎస్లో చేరికలు నిత్యం వెల్లువలా కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడే ఎమ్మెల్యేల సమక్షంలో పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమ, అభివృద్ధి కార్యక్రమాలు తమను ఆకర్షిస్తున్నాయని ఇతర పార్టీల నుంచి వచ్చేవారు పేర్కొంటున్నారు. వాస్తవంగా 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ గెలుపొందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధుల్లో మెజార్టీ భాగం ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. మిగిలిన వారు సైతం బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజాగా అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిశీలిస్తేనే పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం బీఆర్ఎస్లోకి వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఇక కిందిస్థాయి శ్రేణులు సైతం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో నిత్యం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో చింతలపాలెం మండలంలోని దొండపాడు-2 ఎంపీటీసీ తోట సంధ్య బీజేపీ నుంచి ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నకిరేకల్ నియోజకవర్గంలో చందుపట్లకు చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ ఇమడపాక లక్ష్మీవెంకన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన చందంపల్లి ఎంపీటీసీ బోయిళ్ల కిశోర్, ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన నకిరేకల్ వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, నకిరేకల్ మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ ఘర్షకోటి సైదులు, 6వ వార్డు కౌన్సిలర్ మట్టిపల్లి కవిత ఇటీవలే ఎమ్మెల్యే నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. వెల్మినేడు మాజీ సర్పంచ్ మద్దెల మల్లయ్య కూడా బీఆర్ఎస్లో చేరారు. భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ నుంచి భువనగిరి మున్సిపాలిటీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ ఊదరి లక్ష్మీసతీశ్యాదవ్, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నీలం రమేశ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్న శ్రేణులు, కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. దీంతో జిల్లా అంతటా గులాబీ పార్టీలో జోష్ నెలకొంది. విపక్ష పార్టీలు నేటికీ తమ అభ్యర్థులను తేల్చుకోలేకపోవడంతో ఆ పార్టీల క్యాడర్ బేజారవుతున్నారు. తమలో తామే ఆధిపత్యం కోసం పాకులాడుతుండడంతో ఇక లాభం లేదన్న భావనతో మెజార్టీ శ్రేణులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.