నేరేడుచర్ల, మే 4 : మండుటెండలోనే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. పని జరిగే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. సేద తీరేందుకు నీడ, దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేక కూలీలు అవస్థలు పడుతున్నారు. గాయాలైతే చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్కిట్లు కూడా అందుబాటులో లేవు. మారుమూల గ్రామాల్లో పంటల సీజన్ పూర్తయిన తర్వాత రైతులు ఉపాధి హామీ పనులు వైపు మొగ్గుచూపడం సర్వసాధారణం. గ్రామాల వారీగా పని కల్పిస్తున్న అధికారులు పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోత మొదలవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో ఉండే వారే ఉక్కిరిబిక్కి అవుతున్నారు. ఇలాంటి సమయంలో గ్రామానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉపాధి హామీ పనులు చేయడానికి హాజరవుతున్న కూలీలు మండు టెండలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7,65,172 జాబ్ కార్డులకుగానూ 15,98,147 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం 1,39,251 మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు వెళ్తున్నారు.
రోజురోజుకు పెరిగిపోతున్న ఎండ తీవ్రత కారణంగా ఉపాధి హామీ పనులకు రావాల్సిన కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు. ఎండ తీవ్రతలో కష్టపడి పని చేసినా కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని చాలా మంది వేరే ఇతర పనులకు మొగ్గు చూపుతున్నారు. నేరేడుచర్ల మండంలో మొత్తం 8,328 జాబ్కార్డులకుగానూ 19,910 సభ్యులు ఉన్నారు. కానీ పనులకు ప్రస్తుతం 2 వేల మంది లోపు మాత్రమే హాజరవుతున్నారు.
ఊరికి దూరంగా పనులు ఉండడంతో కాలి నడకన పని ప్రదేశానికి చేరుకుంటున్నారు. ఎండలో పని చేస్తే నీరసించి సేద తీరడం కోసం సమీపంలోని చెట్లను ఆశ్రయిస్తున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వారి బాధను అర్థం చేసుకోని పని చేసే ప్రదేశంలో నీడ, నీరు సౌకర్యాలు కల్పించాలి.
పని ప్రదేశాల్లో తాగునీరు, సేద తీరడానికి నీడనిచ్చే విధంగా టెంట్లు కూడా ఏర్పాట్లు చేయడం లేదు. ఇదే సమయంలో వైద్యశాఖ తరపున ఆరోగ్య, ఆశ కార్యకర్తలు కూలీలకు ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఓర్ఎస్ ప్యాకెట్లు, ఒళ్లు నొప్పుల మాత్రలు ఆందిస్తుండడం కంటి తడుపు చర్యగా కనిపిస్తున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాక పోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని కొంత మంది ఈజీఎస్ సిబ్బంది చెబుతుండడం గమనార్హం. పలు చోట్ల ఇంటి నుంచి కూలీలు బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారు. ఎండ వేడికి గంట సేపటికే నీళ్లు వేడెక్కుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉండగా కూలీలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక కూలి గిట్టకపోయినా పర్వాలేదని మధ్యలోనే ఇంటికి వెళ్తున్నారు. సంబంధిత ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు నామమాత్రంగా పర్యవేక్షిస్తున్నారు.
ఎన్ఆర్ఈజీఎస్ పని ప్రదేశాల్లో టెంట్లు, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. కాకపోతే పని జరిగే ప్రదేశంలో గ్రామ పంచాయతీల తరఫున సౌకర్యాలు కల్పించాలని సూచించాం. కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలి. ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.