సూర్యాపేట టౌన్, జనవరి 16 : రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను ఉద్యోగులు తీసుకోవాలని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాస్సోత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత, అరైవ్ ఎలైవ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. రోడ్డు భద్రత పట్ల సామాన్య ప్రజలను, యువతను ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేయాలని కోరారు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ ధరించాలని, హై స్పీడ్ తో వాహనాలు నడపరాదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యమంలా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో ఉద్యోగులు, పౌరులు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత పట్ల నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహితంగా వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంఈఓ శ్రీనివాస్, ఆర్ ఎం ఓ లక్ష్మణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, టౌన్ ఎస్ఐలు మహేంద్రనాథ్, శివ తేజ, ఐలయ్య, ఏఎంవిఐ విక్రమ్, ఏ ఎం వి ఐ సంపత్ పాల్గొన్నారు.

Suryapet Town : రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు పౌరులను ప్రభావితం చేయాలి : డీఎస్పీ వి.ప్రసన్నకుమార్