యాదాద్రి భువనగిరి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని హేళన చేసిన వారికి చెంప పెట్టులా.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూర దృష్టి, విజనరీతో వేల కోట్లు ఖర్చు చేసి విద్యుత్ అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేశారు. నాడు పవర్ హాలీడేలు.. కరెంట్ కోసం ఆందోళనలు, కాల్పులు, మరణాలు జరిగితే.. నేడు వేసవిలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా రోజంతా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ఏకంగా వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందుతున్నది. దళితులు, గిరిజనులకు గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. నాయీబ్రాహ్మణులు, రజకులకు 250యూనిట్లు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 825కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులను పూర్తి చేసింది. సబ్ స్టేషన్లు కేవీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసింది.
మూడు గంటల కరెంట్ చాలంట..!
కర్ణాటకలో గెలిపిస్తే అది చేస్తం.. ఇది చేస్తం.. అని ఎన్నికల ముందు బాకా ఊదిన కాంగ్రెస్ పార్టీ తీరా విజయం సాధించాక చేయ్యిచ్చింది. ఇప్పుడు నిత్యం కరెంట్ కోతలతో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక మన దగ్గర పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే కరెంట్‌పై కుట్ర పూరిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అసలు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని అడ్డగోలు కామెంట్స్ చేశారు. అసలు అధికారంలో లేకముందే.. మూడు గంటల కరెంట్‌పై ధైర్యంగా మాట్లాడితే.. పవర్లోకి వస్తే.. ఇక రోజూ పవర్ హాలీడేలు గడపాల్సిన పరిస్థితి తప్పదు.
కాంగ్రెస్ పాలన కష్టాలు ఇంకా కండ్ల ముందే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు అన్నీఇన్నీ కావు. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. అటు చెరువుల్లో నీళ్లు లేక.. ఇటు బోరు బావులు నడవడానికి కరెంట్ లేక అన్నదాత పడిన పాట్లు ఇంకా కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. పొలాలకు నీళ్లు రాక పంటలు ఎండిపోవడంతో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇంకా గుర్తున్నాయి. వ్యవసాయానికి నాలుగైదు గంటలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడో అర్ధ రాత్రి వచ్చే విద్యుత్ కోసం, బాయికాడ మోటర్ల కోసం వెళ్లి ఎంతో మంది రైతన్నలు ప్రాణాలు విడిచారు. ఇలాంటి ఎన్నో విషాద గాథలు ఉమ్మడి పాలకుల పాలనలో చూసి విసిగిపోయారు.
స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి..
రాష్ట్ర ఆవిర్భావం నుంచి జిల్లాలో విద్యుత్ సరఫరా అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 825 కోట్లను ఖర్చు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 23 ఈహెచ్‌టీ పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే ఇప్పుడు 34కి పెరిగాయి. నాడు 33/11 కేవీ సబ్స్టేషన్లు 71 ఉంటే ఇప్పుడు 94కి పెరిగాయి. 33 కేవీ సబ్స్టేషన్లు 832 నుంచి 1,024కి పెరిగాయి. 11 కేవీ సబ్స్టేషన్లు 5,103 నుంచి 7,761కి పెరిగాయి. అంటే కొత్తగా 2658 ఏర్పాటయ్యాయి. ఎల్టీ లైన్లు 12,009 ఉండగా, 14,958కి పెరిగాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు 135 నుంచి 181కి పెరిగాయి. యాదాద్రి భువనగరి జిల్లాలో తెలంగాణ ఏర్పాటు కంటే ముందు 2,96,115 విద్యుత్ వినియోగదారులు ఉండగా, ఇప్పుడు 4,22,506 కనెక్షన్లు ఉన్నాయి. అంటే 1,26,391 కనెక్షన్లు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక 1,87,549 గృహ వినియోగదారులు ఉండగా, ప్రస్తుతం 2,61,997 వినియోగదారులు ఉన్నారు. అంటే 74,448 కనెక్షన్లు పెరిగాయి.
రోజంతా మిషన్లు నడుస్తున్నాయి
సూర్యాపేట రూరల్ : ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సకాలంలో రాకపోవడంతో ఫర్నిచర్, వుడ్ వర్క్ పనులు జరిగేవి కావు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రోజంతా మిషన్లు నడుస్తున్నాయి. దీంతో ఫర్నిచర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రోజుకు నలుగురికి ఉపాధి దొరుకుతుంది. కరెంటు 24 గంటలు రావడంతో పనులు ఎక్కువ జరిగి నెలకు 40 నుంచి 50 వేల వరకు సంపాదిస్తున్నా. పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– తౌడోజు వెంకటా చారి,సూర్యాపేట మండలం
గతంలో మోటార్లు పదే పదే కాలిపోయేవి
కష్టం చేసే నిజమైన రైతుకు కరెంట్, సీఎం కేసీఆర్ విలువ తెలుస్తుంది. రైతుల విలువ తెలియనోళ్లే మూడు గంటల కరెంట్ సరిపోతుందంటారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం బాగుంది. గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక నానా కష్టాలు పడే వాళ్లం. మోటార్లు పదే పదే కాలిపోయేవి. రాత్రులంతా పొలాల వద్ద జాగారాం చేసేవాళ్లం వ్యవసాయమన్నా, రైతు జీవితమన్నా విరక్తి కలిగేది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులంతా సల్లగా ఉన్నాం. ఈ ఏడాది వానకాలం సాగుకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా డ్యామ్‌లో నీళ్లు లేకున్నా అంతో, ఇంతో పొలాలు నాట్లు పెట్టుకుంటున్నమంటే అది సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంట్ చలువే. సీఎం కేసీఆర్ ఉన్నాడనే ధైర్యంతోనే సాగు చేస్తున్నాం. డ్యామ్‌లో కొద్దిగా నీరు చేరినా రైతులకు తప్పక న్యాయం చేస్తడనే నమ్మకం ఉంది. సీఎం కేసీఆర్ సార్ ఉన్నంత వరకు రైతుల మంతా భద్రంగా ఉంటాం.
-లక్ష్మారెడ్డి, రైతు యల్లాపురం, పాలకవీడు మండలం
ఎప్పుడంటే అప్పుడు పంటకు నీరు పెట్టుకుంటున్నాం
గత కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. సరైనా సమయంలో వర్షాలు రాక పంటలు నాశనం అయ్యేవి, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతులకు దేవుడయ్యాడు. సరైనా సమయానికి వర్షాలు రాకున్నా బోర్ల సాయంతో ఎప్పుడంటే అప్పుడు పంటకు నీరు పెట్టుకుంటున్నాం. మంచి దిగుబడి పొందుతున్నాం. కాంగ్రెస్‌తో కరెంటు రాదు, పథకాలు రావు, సీఎం కేసీఆర్ సార్ తోనే ఇవన్నీ వస్తాయని నమ్ముతున్నాం. ఈసారి కూడా కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణలో వస్తుంది. దేశంలో కూడా రావాలని కోరుకుంటున్నాం.
– జనగాం అంజయ్య, రైతు, చొల్లేడు (మునుగోడు రూరల్)
కరెంట్ బాగానే ఉంటుంది
గతంలో కరెంట్ కోతలతో ఇంటి తలుపులు దర్వాజా, కిటికీల కోసం కట్టె మొద్దును కోపించు కోవడానికి మిల్లు దగ్గరకు వెళ్తే రోజుల తరబడి సమయం పట్టేది. ప్రస్తుతం పట్టణాలు, గ్రామాల్లో ఎలాంటి కరెంట్ కోతలు లేవు. బాగానే పనులు జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కోట్ల రూపాయలు వెచ్చించి ఇచ్చిన హామీ మేరకు కరెంట్‌ను వినియోగంలోకి తెస్తున్నందుకు చాలా సంతోషం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణాపడి ఉంటాం.
-ఎర్రసాని అంజయ్య(తూర్పుగూడెం), తుంగతుర్తి
24గంటల కరెంట్ మాకు వరం
రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడంతో మాకు ఎంతో మేలు జరుగుతుంది. మాలాంటి పేదలకు వరం. గత ప్రభుత్వ హయాంలో వచ్చిరాని కరెంట్‌తో మోటారు కాలిపోతే బాగు చేయడానికి కనీసం 2, 3 రోజులు పట్టేది. ప్రతిరోజు కరెంట్ కోసం ఎదురు చూపులు మిగిలేవి. ఇప్పుడూ 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రోజుకు మూడు నుంచి నాలుగు మోటార్లు బాగు చేస్తున్నాం. నేడు ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం.
– కట్టా అజయ్(మెకానిక్, పాతర్లపహాడ్)
8 ఏండ్లుగా ఇన్వర్టర్తో పనిలేకుండా పోయింది
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తీవ్ర కరంట్ కష్టాలో ఇబ్బందులు పడేవాళ్లం. వేల రూపాయలు ఖర్చు చేసి పవర్ బ్యాకప్ కోసం ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సి వచ్చేది. కరంట్ బిల్లులు కూడా అధికంగా వచ్చేవి. వచ్చిన పైసాల్లో చాలా వరకు దుకాణం కిరాయి, కరెంట్ బిల్లులకు సరిపోయేది. కరెంట్ హెచ్చు తగ్గుల వల్ల తరుచూ కంప్యూటర్లు కాలిపోతూ ఉండేవి. సీఎం కేసీఆర్ అధికారంలోకి 24గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు.నేడు మాకు కరెంట్ కష్టాలు లేవు. 8 ఏండ్లుగా ఇన్వర్టర్తో పనిలేకుండా హుజూర్నగర్ వివేకానంద సెంటర్లో కంప్యూటర్ రిపేర్(హార్డ్‌వేర్) దుకాణం నడుపుతున్నా. కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. నిత్యం కరంట్ ఉండడం వల్ల ఇబ్బందులు లేకుండా రిపేరింగ్ చేసుకుంటున్నా. 24 గంటలు విద్యుత్ రావడం వల్ల మా లాంటి దుకాణాలకు ఇబ్బంది లేకుండా ఉంది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-అభిమళ్ల నాగరాజు,కంప్యూటర్ హార్డ్‌వేర్ షాపు యజమాని, హుజూర్నగర్
దుకాణం సాఫీగా సాగుతుంది
నాలుగేండ్లుగా నాంపల్లిలో పాల కేంద్రం, ఐస్ క్రీమ్ పార్లర్ ని నిర్వహిస్తున్నాం. రెండు నిల్వ ఉండాలంటే కరంటు సమస్య లేకుండా ఉండాలి. పాల వ్యాపారం కాబట్టి రాత్రి సమయంలో కూడా ఫ్రీజ్ ఆన్‌లో నే ఉంచుతాం. రాత్రి, పగల సమయంలోనైనా గంట కరంటు పోతే పాలు పగిలిపోయి వేల రూపాయాల్లో నష్టం వస్తుంది. దుకాణం ప్రారంభించినప్పటి నుంచి కరంటుతో సమస్య లేదు. లక్షల రూపాయలు పెట్టి అప్పు చేసి దుకాణం పెట్టాలంటే మొదట్లో కొంచెం భయం అనిపించింది. ఇంట్లో గృహిణిగా ఉన్నప్పుడు కరంటు పోకుండా ఉండడంతో ముందడుగు వేసి షాప్ ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం కరంటు సమస్యలు లేకుండా సాఫీగా సాగుతుంది. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వ ఉంటేనే ప్రజలు బాగుపడతారు.
-సల్వాది చంద్రకళ, పాల కేంద్రం నిర్వాహకురాలు, నాంపల్లి
వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా ఉంది
కొన్నేండ్లుగా పాలిష్మిల్లు లీజుకు తీసుకొని నడుపుకుంటున్నా. సమైక్య పాలనలో కరంటు సమస్య తీవ్రంగా ఉండేది. అప్రకటిత కోతలు, లో ఓల్టేజి సమస్యతో నేను చానా ఇబ్బందులు పడ్డాను. మోటర్లు కాలిపోయి నష్టపోయినం. వారానికి ఒక రోజు పవర్ హాలీడేలు పాటించాము. కరంటు కోసం ఎప్పుడే ఇబ్బందులే పడ్డాను. అడిగిన సమయానికి పాలిష్‌రాయి అందించలేక పోయేవాళ్లం. మాతో పాటుగా మిల్లుల్లో పనిచేసే కార్మికులు సైతం పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో కేవలం ఏడాది లోపే కరెంటు సమస్య తీరింది. నిరంతరం 24 గంటల కరెంటు రావడం వల్ల మా వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇతర రాష్ర్టాలను చూసుకుంటే మన తెలంగాణ ఎంతో బెటర్‌గా ఉంది. ఇలాంటి సీఎం మనకు ఉండడం మన ఆదృష్టం.
– ఎస్..శంకరాచారి, పాలిష్ మిల్లు వ్యాపారి, దామరచర్ల