కొండమల్లేపల్లి, మే 31 : విద్యుత్ బిల్లులను సిబ్బంది సకాలంలో వసూలు చేయాలని డివిజన్ ఇంజినీర్ విద్యాసాగర్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల విష్ణు కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉద్యోగులకు నూతనంగా అందించిన బిల్లింగ్‌కు సంబంధించి డిజిటల్ యంత్రాల వినియోగంపై హైదరబాద్‌కు చెందిన అనాలాజికల్ కంపెనీ సర్వీస్ ఇంజినీర్లు సంతోష్, మహేశ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. ఎలాంటి పెండింగ్ లేకుండా డిజిటల్ యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు వసూలు చేసే విధంగా సిబ్బంది పని చేయాలని సూచించారు.
సకాలంలో బిల్లులు వసూలు చేస్తేనే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు రావడం జరుగుతుందన్నారు. లేకుంటే సంస్థ ఇబ్బందుల్లో కూరుకుపోతుందన్నారు. బిల్లుల వసూళ్లలో సూర్యాపేట, యాదాద్రి జిల్లాల తర్వాత నల్లగొండ జిల్లా ఉందని తెలిపారు. నల్లగొండ జిల్లా ముందు వరుసలో ఉండేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ, నాంపల్లి ఏడీఈలు సైదులు, సాగర్‌రెడ్డి, దేవరకొండ డివిజన్లోని పది మండలాలకు చెందిన ఏఈలు, లైన్మెన్లు, బిల్లింగ్ చేసే జూనియర్ లైన్మెన్లు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.