దేవరకొండ, డిసెంబర్ 16 : బుధవారం జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడో విడత ఎన్నికలో భాగంగా దేవరకొండ డివిజన్లోని చందంపేట, దేవరకొండ, చింతపల్లి, గుండ్లపల్లి, నేరేడుగొమ్మ, పీఏ పల్లి, గుడిపల్లి, గుర్రంపోడు మండలాల్లో 227 గ్రామ పంచాయతీల్లో 1,603 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. అన్ని గ్రామ పంచాయతీల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బలగాలను మోహిరించినట్లు చెప్పారు. ఎన్నికలకు అటంకాలు కలిగించవద్దని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్, కౌంటింగ్ జరిగేలా అంతా సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎన్నికల జోనల్ అధికారులు పాల్గొన్నారు.