నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 9న తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్తో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుంది. అప్పటి నుంచి ప్రతీ విడతకు నాలుగు రోజుల గడువుతో రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి విడతగా నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో మిర్యాలగూడ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ కొత్తగా ప్రభుత్వ పథకాలకు శ్రీకారం చుట్టడం లేదా పూర్తయిన పథకాలు ప్రారంభించడం చేయరాదని స్పష్టం చేశారు.
అయితే వచ్చే నెల 8న బీసీ రిజర్వేషన్ల బిల్లుపై హైకోర్టులో వాదనలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత షెడ్యూల్, రిజర్వేషన్లపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఏడాది జనవరి చివరితో గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు, అదే ఏడాది జూలైలో మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖత చూపకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయి దా పడుతూ వచ్చాయి.
అయితే ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కా ర్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఎట్టకేలకు ఎన్నికల షె డ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో అందుకు అనుగుణంగా గ్రామాల్లో ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎన్నికలపై దృష్టి సారించారు. షెడ్యూల్ కూడా వెలువడటంతో అభ్యర్థుల ఎంపికపై చర్చోపర్చలు సాగుతున్నాయి. దసరా తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయం వేడెక్కనుంది.
రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు..
తొలి విడత నామినేషన్ల స్వీకరణ వచ్చే నెల 9న ప్రారంభం కానుండగా 23న పోలింగ్ జరుగనుంది. తొలి విడతలో నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 18 జడ్పీటీసీ, 196 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో మిర్యాలగూడ, చండూరు డివిజన్ల పరిధిలోని 15 జడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో మొత్తం 33 జడ్పీటీసీ,353 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో 13వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 27న పోలింగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించి నవంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
పంచాయతీలకు మూడు విడతల్లో..
కాగా పరిషత్ ఎన్నికల మధ్యలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. వచ్చే నెల 17, 21, 25 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా పంచాయతీలకు వచ్చే నెల 31న, నవంబర్ 4న, నవంబర్ 8న పోలింగ్ జరుగనుంది.
తొలి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 318 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 282 పంచాయతీలకు, మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 269 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 10,73,506 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 5,30,860 మంది, మహిళలు 542,589 మంది, ఇతరులు 57 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 935 ప్రాంతాల్లో 1957 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.
పటిష్ట చర్యలు : కలెక్టర్ త్రిపాఠి
రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ జిల్లాలోని ఏర్పాట్లను వివరించారు. పరిషత్ ఎన్నికలను రెండు విడతల్లో, పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు చేపడుతన్నట్లు చెప్పారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీసుల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేస్తామన్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డీపీవో, ఎన్నికల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.