భూదాన్ పోచంపల్లి, మే 4 : కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని తాపీ వరర్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు, రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అందరికీ అమలు కాలేదని, సాంకేతిక సమస్యలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. రైతాంగాన్ని మోసం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, చేనేత కార్మికుల సమస్యలను పరిషరించాలని కోరారు. బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్ట్, గంధమల్ల చెరువు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని ప్రకటిస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా మావోయిస్టులను పిట్టల్లా కాల్చుతున్నదని అన్నారు. షరతులు లేకుండా చర్చలు జరుపాలని, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కగార్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కామ్రేడ్ ఎమ్మెల్సీ సత్యంను పలువురు నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురుమిద్ద శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, మండల కార్యదర్శి గోడల భూషణ్, నాయకులు పబ్బు యాదయ్య, మిర్యాల కృష్ణమూర్తి, సీత సత్యనారాయణ, సురకంటి సాయిరెడ్డి, ముసునూరి రాములు, వలందాసు సోమయ్య, వంగరి నరసింహ, చింతకుంట్ల బుచ్చిరెడ్డి, గుర్రు బాలయ్య, సంగెం గణేశ్, ముషం శివ పాల్గొన్నారు.
కోదాడ, మే 4 : వడ్డె ఓబన్న జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో వడ్డెర కులస్తులు ఏర్పాటు చేసిన వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికంటే ముందే వడ్డె ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతిగా పనిచేశారని, సమరసింహంలా విరుచుకుపడి మూడు వేల మంది బ్రిటిషు సైనికులను మట్టు పెట్టారని తెలిపారు. సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆయన వ్యక్తిత్వం ఆదర్శనీయమని చెప్పారు. వడ్డెరలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, నాయకులు గుంజ సైదులు, చింతల లింగయ్య, చింతల నాగేశ్వర్రావు, షేక్ ఇమ్రాన్ ఖాన్, సంపెట ఉపేందర్, బత్తుల ఉపేందర్, వేముల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.