నల్లగొండ, మే 11: ఈ నెల 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు మక్కు వినియోగించుకునేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన క్యాండిల్ వాక్‌ను ఆయన జండా ఊపి ప్రారంభించారు.
అనంతరం క్లాక్‌టవర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గంలో గతంలో 61 నుండి 64 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ సారి 80 నుంచి 90 శాతం పోలింగ్ అయ్యే విధంగా చూడాలని కోరారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ ఓటు హకు ఉన్న వారంతా బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ చాంబర్లో సూర్యాపేట, నల్లగొండ కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.