హుజూర్నగర్, డిసెంబర్ 16 : ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికలపై నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. జిల్లాలో ఈ నెల 17న నిర్వహించే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, హుజూర్నగర్ మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల పరిధిలో గల 146 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, అలాగే 1,318 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా 22 మంది సర్పంచులు, 257 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. మిగతా 124 గ్రామ పంచాయతీలకు, 1,061 వార్డు సభ్యుల స్థానాలకు 1,176 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
పోలింగ్ ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి లెక్కింపు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటు వేయడం బాధ్యతగా భావించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు కాల్చడం లాంటివి చేయకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా అభ్యర్థులు, అధికారులు, ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓలు సరోజ, సోమ సుందర్ రెడ్డి, లక్ష్మి, జగదీశ్, సుమంత్, తాసీల్దార్లు స్రవంతి, సైదులు, కమలాకర్, మంగా, కవిత, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.