సూర్యాపేట, పిబ్రవరి 27 : ప్రతి నెలా పింఛన్ ఇచ్చే పోస్టాఫీసుకు తాళం పడటంతో మూడు రోజులుగా పింఛన్ కోసం వస్తున్న వృద్ధులు, వికలాంగులు పోస్టాఫీసు ఎదుట తీవ్ర ఇబ్బందులు పడుతూ నిరీక్షిస్తున్నారు. పెన్షన్ డబ్బులు ఎప్పుడిస్తారో తెలియడంలేదని, వచ్చే పింఛన్ డబ్బులు ఆటో చార్జీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సూర్యాపేట 20వ వార్డులోని జమ్మిగడ్డ బ్రాంచి పోస్టాఫీసు గత మూడు రోజులుగా తెరుచుకోవడంలేదు. దీంతో పింఛన్తో పాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలగాని బాలుగౌడ్ అనే వ్యక్తి ఆరోపించారు.
బీపీఎం సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని ఈ పోస్టాఫీసుకు 7,8,9,21,23వార్డులకు చెందిన వృద్ధులు, వికలాంగులు తదితరులు పింఛన్ కోసం రోజూ వస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయం కౌన్సిలర్లకు కూడా చెప్పామన్నారు. బ్రాంచి పోస్టుమాస్టర్ సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో నెల నెలా పెన్షన్ తీసుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.