నల్లగొండ : ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి మండలంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో రూ.15 లక్షలు, పోతినేనిపల్లి గ్రామంలో రూ.5 లక్షలు, నెమ్మాని గ్రామంలో రూ.10 లక్షలు, జువ్విగూడెం గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ప్రధానమైన అన్ని రోడ్లను, డ్రైనేజీలను పూర్తి చేస్తామని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయిస్తుందని తెలిపారు.
అనంతరం మండలంలోని తొండ్లాయి, పోతినేనిపల్లి, షాపల్లి గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్య కారణంగా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరవతో మంజూరు అయిన రూ.4 లక్షల విలువ గల చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.