కోదాడ, జూలై 17 : విద్యార్థుల కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల ప్రాంగణంలో మున్సిపల్ శాఖ సహకారంతో విరివిరిగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. బాలికల ప్రత్యేక టాయిలెట్ల కోసం రూ.7 లక్షలు మంజూరు చేస్తూ వాటి నిర్మాణానికి ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల పఠనాశక్తిని, రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను, పాఠశాల రికార్డులను పరిశీలించారు.
ప్రభుత్వ దవాఖానాను పరిశీలించిన కలెక్టర్ ప్రసూతి వైద్యురాలు విధుల గైర్హాజరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు తనిఖీకి వచ్చినా వైద్యురాలు విధుల్లో ఉండడం లేదని, ఈ అంశంపై నివేదిక సమర్పించాలని దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ దశరథను ఆదేశించారు. ఆ తర్వాత ఔషదాల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. రోగులకు మందులు అందుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంద పడకల దవాఖానా నిర్మాణ పనులను పరిశీలించారు.
పట్టణంలోని ఎరువుల దుకాణాలను కలెక్టర్ పరిశీలించారు. యూరియా, డీఏపీలపై ఆరా తీశారు. స్టాక్ రిజిస్ట్రర్ను తనిఖీ చేశారు. అలాగే రైతులకు అందిస్తున్న బిల్లు బుక్కులను, రసీదులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సకాలంలో ఎరువులను అందజేయాలన్నారు. వ్యవసాయ అధికారి ఎప్పటికప్పుడు నిల్వలను పరిశీలించి రైతులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యానారాయణ, తాసీల్దార్ వాజిద్అలీ, డీపీఎస్హెచ్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ సలీం షరీఫ్, ఇన్చార్జి హెచ్ఎం డి.మార్కండేయ ఉన్నారు.
Kodada Rural : విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్