నల్లగొండ, జూలై 31 : వసతి గృహ సంక్షేమ అధికారుల ప్రమోషన్స్ విషయంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం సహకారంతో ఉన్నత అధికారులను కలిసి పరిష్కరిస్తానని టీఎన్జీవోస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి తెలిపారు. తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం గురువారం స్థానిక టీఎన్జీవోస్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రణధీవే, కార్యదర్శి ఏ.సత్యనారాయణ, టీఎన్జీవోస్ ఉపాధ్యక్షురాలు రమ్య సుధా, తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం కేంద్ర ట్రెజరర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి మాట్లాడుతూ.. వసతి గృహ సంక్షేమ అధికారుల డైట్ బడ్జెట్ అలాగే బిల్లులు త్వరగా పాస్ కావడానికి తగిన కృషి చేస్తానని తెలిపారు. నూతన వసతి గృహ సంక్షేమ అధికారులందరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని, రెవెన్యూ డివిజన్ల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నల్లగొండ జిల్లా నందు ఉన్న ప్రతి వసతి గృహ సంక్షేమ అధికారి బడుగు బలహీన వర్గాల, పేద పిల్లల కోసం నిరంతరం కృషి చేస్తూ వారి అభ్యున్నతికి ఎంతో తోడ్పడుతున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారులందరూ పాల్గొన్నారు.