రామగిరి, డిసెంబర్ 13 ; ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, తమకు మినిమం టైం స్కేల్ ఇవ్వడంతోపాటు.. సర్వీసులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ- సమగ్ర శిక్షలో వివిధ హోదాలో పనిచేసే ఉద్యోగులు సమ్మెకు దిగారు. వాటిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే ప్రత్యేకాధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది ఉండడంతో చదువులు సాగడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 కేజీబీవీలో విద్యాబోధన నిలిచిపోయింది. మరో రెండు, మూడు నెలల్లో ఇంటర్మీడియట్, టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పని చేస్తున్న 2,192 మంది ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతుండటంతో ఎమ్మార్సీలు, భవిత సెంటర్లు తాళాలతో దర్శనమిస్తున్నాయి. దాంతో వారం రోజులుగా చదువులకు బ్రేక్ పడింది. కేజీబీవీలో మాత్రం ఒక టీచర్, ఒక పీఈటీ చొప్పున విధులు నిర్వహిస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో ఆయా పాఠశాలల్లోని 7వేల మందికి పైగా విద్యార్థులు హాస్టల్ గదులకే పరిమితమయ్యారు.
సమ్మెతో పలు విభాగాల్లో సేవలకు ఆటంకం
మండల వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ సమ్మెలోనే ఉంటున్నారు. దాంతో వాటికి తాళాలు కూడా తీయడం లేదు. అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవలందించే ఐఈఆర్పీలు, ఉమ్మడి జిల్లాలోని 100 భవిత సెంటర్స్ మూతపడటతో సుమారు 8వేలకుపైగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో కీలక భూమిక పోషిస్తున్న క్లస్టర్ రీసోర్స్పర్సన్స్(సీఆర్పీలు) సమ్మెలో ఉండటంతో పలు సేవలకు ఆటంకం ఏర్పడింది. మరో వైపు విద్యార్థులకు కో కరిక్యులమ్ అంశాలు నేర్పించే పార్ట్ టైం ఇన్స్టెక్టర్స్ సైతం సమ్మెలో కొనసాగుతున్నారు. దాంతో ఆయా పాఠశాలల్లో బోధనకు అంతరాయం కలుగుతున్నది. ఇక అర్బన్ రెసిడెన్షియల్లో పనిచేసే బోధన, బోధననేతర సిబ్బంది, విద్యాశాఖ-సమగ్రశిక్ష జిల్లా కార్యాలయంలో పనిచేసే ఏపీఓ, ఇతర హోదాల సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రభుత్వ పంతంతోనే సమస్యలు
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో బోధించే సిబ్బంది మాదిరిగానే మేము 24 గంటలు విధుల్లో ఉంటున్నాం. వారికిస్తున్న లక్షల వేతనాలు కాకపోయినా కనీస వేతనాలు కూడా ఇవ్వరా..? ఇదెక్కడి న్యాయం.? ఇంత దారుణంగా వెట్టిచాకిరి చేయించుకుంటారా..? మేము సమ్మెలో ఉన్నప్పటికీ పిల్లలకు ఇబ్బంది లేకుండా భోజనం పెడుతున్నాం. ప్రతి రోజూ ఒక ఉపాధ్యాయురాలిని విద్యార్థుల పర్యవేక్షణకు ఉంచుతూ రక్షణ కల్పిస్తున్నాం. ప్రభుత్వ పంతం కారణంగానే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ప్రభుత్వ వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉదోగ్యులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
– నీలాంబరి, ఎస్ఓ, కేజీబీవీ, కట్టంగూర్
సీఎం రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకోవాలి
సమగ్ర శిక్షలో ప్రభుత్వ టీచర్స్, ఇతర ఉద్యోగులతో సమానంగా ఏండ్ల తరబడి పనిచేస్తున్నాం. చాలీచాలని వేతనాలతో జీవితం గడుపుతున్నాం. ఒడిశా, మహారాష్ట్ర, హర్యానాలో మాలాంటి ఉద్యోగులను అక్కడి ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాయి. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సమస్యలు పరిష్కరించే వరకు ఐక్యంగా ఉండి సమ్మె కొనసాగిస్తాం.
– మొలుగురి కృష్ణ, సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు