నిడమనూరు, ఆగస్టు 19 : ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను భోధించి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన టిఎల్ఎం మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బోధనాభ్యసన ఉపకరణాలను ప్రదర్శించిన ఉపాధ్యాయుల ప్రతిభను ప్రశంసించారు.. విభిన్నమైన బోధన పద్ధతుల ద్వారా విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభావంతులుగా తయారు చేయాలని సూచించారు.
తాసీల్దార్ జంగాల కృష్ణయ్య మాట్లాడుతూ.. పాఠ్యాంశాలను వినూత్న పద్ధతుల ద్వారా బోధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. మెరుగైన విద్యను అందించేందుకు పాటుపడాలన్నారు. అనంతరం 44 ప్రాథమిక పాఠశాలల నుంచి ప్రదర్శించిన 70 ప్రదర్శనలో పది మందిని ఎంపిక చేసినట్లు ఎంఈఓ లావూరు వెంకన్న తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన వారిని జిల్లా స్థాయికి పంపనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గౌతమ్, రాములు, శ్రీనివాస్, పీఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు పాంపాటి శ్రీనివాసులు, సురేందర్ రెడ్డి, యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు కె.సైదులు, అంజయ్య, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.