సూర్యాపేట, జూలై 27 : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరుతూ శనివారం విద్యార్థులతో కలిసి సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి నిధుల కేటాయింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రె స్ పార్టీ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినా.. విద్య కు కనీసం 15శాతం నిధులు కూడా కేటాయించలేదని విమర్శించారు.
విద్యారంగానికి చేసిన కేటాయింపులు సరిపోవని, తక్షణమే బడ్జెట్‌ను సవరించి కనీసం 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని, వెంటనే మంత్రిని ఏర్పాటు చేయాలని అన్నారు. 1400 మంది విద్యార్థులు చదువుతున్న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరిపడా తరగతి గదులు లేవని తెలిపారు. అదనపు తరగతి గదులను నిర్మించాలని, ప్రతి గ్రామానికీ బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థుల ఉన్నత విద్యకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్‌లోకి పోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దాం తో పోలీసులు, విద్యార్థులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కలెక్టరేట్ కార్యాలయ అధికారి సుదర్శన్‌రెడ్డి విద్యార్థుల వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, నాయకులు అక్కెనపల్లి వినయ్, విష్ణు, తన్వేశ్, శ్రవణ్, విద్యార్థులు పాల్గొన్నారు.