రామగిరి, డిసెంబర్ 20 : ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 2025లో జరిగే పబ్లిక్ పరీక్షల కోసం ఇప్పటికే 90 రోజుల ప్రణాళికలను ప్రారంభించారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టు వారీగా ఆయా అధ్యాపకులు ప్రశ్నల నిధిని తయారు చేసి నిత్యం విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మరో వైపు అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ప్రయోగ పరికరాలు కొనుగోలు కోసం ఒక్కో కళాశాలకు రూ. 25వేలు, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 6వేలను ఇంటర్ బోర్డు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. కళాశాలలో విద్యార్థులకు ఆకలి తీర్చేందుకు ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుందని పలు కళాశాలల నిర్వాహకులు కోరుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రథమ, ద్వితీ య సంవత్సరం విద్యార్థులు 12,060 మంది ఉన్నారు. వీరందరికీ ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ అధ్యాపకులు చదివిస్తున్నారు. దీంతో జిల్లాలో ఫలితాలు పెరిగేలా చూస్తున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలకు ఉపయోగపడే ప్రయోగ పరికరాల కొనుగోళ్లకు ఇంటర్మీడియట్ బోర్డు ఈ పర్యాయం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ప్రతి కళాశాలకు రూ. 25వేలు, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 6వేలను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ బ్యాంక్ ఖాతాల్లో రెండు రోజుల క్రితం జమచేసింది. దీంతో ప్రాక్టికల్ సామగ్రి పూర్తి అందుబాటులోకి రానుండగా, సీసీ కెమెరాలతో నిఘా ఉండనుంది.
వందశాతం ఫలితాలు సాధించేలా అధ్యాపకులందరితో కలిసి ప్రత్యేక ప్రణాళిక తయారు చేశాం. ఇప్పటికే కళాశాలలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థినులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలమేరకు 90రోజుల ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తున్నాం.
– సుధారాణి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నల్లగొండ
అన్ని కళాశాలల్లో పక్కా ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించాం. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సమిష్టిగా పనిచేయాలి. ఉత్తమ ఫలితాలు సాధించి ఈ పర్యాయం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రయోగ పరికరాలు, సీసీ కెమెరాలకు నిధులివ్వడం శుభ పరిణామం. వాటిని కమిటీలతో ఆమోదించి త్వరగా కొనుగోలు చేసి అందుబాటులోకి తేవాలి.
– దస్రూనాయక్, డీఐఈఓ, నల్లగొండ