కట్టంగూర్, ఆగస్టు 13 : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని నల్లగొండ జిల్లా విద్యా శాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధనోపకరణల మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. బోధన ఉపకరణాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ శక్తి పెంపొందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థి గొప్ప శాస్త్రవేత్త, ఇంజినీర్‌గా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు రూపొందించిన బోధన-అభ్యసన సామగ్రిని మేళాలో ప్రదర్శించారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసిస్తూ ఉత్తమ ప్రదర్శనలకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు, ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.