మునుగోడు, సెప్టెంబర్ 25 : మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రకు గురువారం పిలుపునివ్వడం జరిగింది. కాగా పాదయాత్రను నిర్వహించకుండా పోలీసులు నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. దీనిపై డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్ అనేది అధికార పార్టీ నాయకుల చేతకాని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. కల్వకుంట నుండి వెలమకన్నె గ్రామానికి మంజూరైన బీటీ రోడ్డును అసంపూర్తిగా వదిలేశారని, దాన్ని తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి కొండాపురం రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పోరాటం నిర్వహించినా అధికారులు, నాయకులు ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
గ్రామం నుంచి సుమారు 50 మంది విద్యార్థులు పై చదువుల కోసం నిత్యం ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారని, తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఉన్నత చదువుల కోసం దోహదపడాలని కోరారు. గ్రామంలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేకపోవడం గ్రామంలో అక్కడక్కడ మురుగునీరు నిల్వ ఉండడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నట్లు చెప్పారు. వీధిలైట్లు లేకపోవడం, కొన్నిచోట్ల కరెంట్ తీగలు క్రిందకు ఉండడం, కరెంటు స్తంభాలు కొన్నిచోట్ల వంగి ఉండటం వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి పగిళ్ల మధు, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు మిరియాల భరత్, మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి నరేశ్, డీవైఎఫ్ఐ నాయకులు కట్ట ఆంజనేయులు, బొందు శివ, కుక్కల మహేశ్, పగిల్ల యాదయ్య, నారగోని పవన్, గీత, సంగం నాయకులు అయితగోని యాదయ్య పాల్గొన్నారు.