రామగిరి, జూన్ 15 : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులు కొందరు పదోన్నతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పీఈటీల పదోన్నతుల జాబితాలో నకిలీ సర్టిఫికెట్ల విషయం జిల్లాలో కలకలం రేపుతున్నది. పీఈటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయడంతోపాటు ఈ నెల 10న డీఈఓ కార్యాలయంలో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ పూర్తి చేసుకున్నట్లు ఓ వ్యాయమ ఉపాధ్యాయ సంఘం నాయకులు కలెక్టర్, డీఈఓలకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ పదోన్నతుల్లో భాగంగా పీఈటీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ విభాగంలోని ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్‌లను ఈ నెల 10న నల్లగొండ డీఈఓ కార్యాలయంలో పరిశీలించారు. అయితే.. కొందరు ఉపాధ్యాయులు పీఈటీ నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకుని అర్హత ఉన్నట్లుగా నిర్ధారణ చేయడంతో సీనియారిటీ జాబితాలో చోటు దక్కింది. దాంతో న్యాయబద్ధంగా ఉన్న ఉపాధ్యాయులు నష్టపోతున్నారని వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం, వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా జిల్లాలో చర్చగా మారింది.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 124మంది పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులకు ఈ నెల 10న డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్, సర్వీస్ బుక్ పరిశీలనకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కొంత మంది లోకల్ బాడీ (జడ్పీ), ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న పీఈటీలు ఇన్ సర్సీస్‌లో బీపీఈడీ చేశారు. అయితే.. ఆ కోర్సు కాల వ్యవధి సంవ్సతరం ఉన్న సమయంలో జీఓ ఎంఎస్ నెం.17 ప్రకారం ఎన్ని రోజుల్లో కోర్సు పూర్తి చేశారనేది చూపకుండా బీపీఈడీ పూర్తి చేసినట్లు మాత్రమే చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
మరో వైపు జిల్లా వ్యాప్తంగా 12 మంది పీఈటీలు నకిలీ సర్టిఫికెట్లు, సర్వీస్ పుస్తకంతో పదోన్నతులకు అర్హత ఉన్నట్లు చూపించి పదోన్నతుల జాబితాలో చోటు దక్కించుకున్నారని, దాంతో అర్హతలున్న ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టీజీయూఎస్), వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకపోవడంతో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే పదోన్నతుల్లో అడ్డదారి తొక్కిన 12మందిలో 8మంది ఉపాధ్యాయులు వెనక్కి తగ్గారు. మిగిలిన నలుగురిని డీఈఓ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా రాకుండా పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కొంత మంది ఉపాధ్యాయులు నకిలీ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్‌లను చూపించారని ఉన్నతాధికారులకు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఫిర్యాదు చేయడంతో మా దృష్టికి వచ్చింది. ఫిర్యాదు చేసిన నేతలు పేర్కొన్న టీచర్ల వివరాల ప్రకారం వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నాం. విద్యాశాఖ కార్యాలయంలో హాజరు కావాలని తెలిపినా కొంత మంది రావడం లేదు. తప్పించుకు తిరుగుతున్నారు. సదరు ఉపాధ్యాయులు చూపిన సర్టిఫికెట్లు, సర్వీస్ పుస్తకం నకిలీవి అని తెలితే వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హులైన పీఈటీలందరికీ న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ