మార్కెట్లో పేపర్‌కు మంచి డిమాండ్ ఉండడంతో సుబాబుల్ కర్రకు గిరాకీ పెరిగింది. ఫలితంగా సుబాబుల్ సాగు చేసిన రైతులకు రెట్టింపు ఆదాయం వస్తున్నది. ప్రతి రెండు సంవత్సరాలకోసారి కటింగ్‌కు వచ్చే ఈ పంట 4 కటింగ్ల తర్వాత తోటను తీసేయాలి. పెట్టుబడి పోను ఎకరాకు రెండు సంవత్సరాలకు రూ.80వేల ఆదాయం వస్తున్నది. ఈ క్రమంలో పెద్దవూర మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుడుం వెంకటయ్య అందరిలా సంప్రదాయ పంటలు కాకుండా వినూత్నంగా సుబాబుల్ వేసి మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్నాడు. సుబాబుల్ సాగుతో లాభాలు బాగున్నాయంటున్నాడు.
వెంకటయ్యకు 8 ఎకరాల భూమి ఉండగా.. మూడెకరాల్లో ఆరు ఏండ్లుగా సుబాబుల్ సాగు చేస్తున్నాడు. భద్రాచలంలోని ఐటీసీ రా మెటీరియల్ కాంట్రాక్టర్ వద్ద నుంచి సుబాబుల్ విత్తనాలు ఉచితంగా తీసుకొచ్చి విత్తాడు. మొదటి సంవత్సరం మొక్కల పెరుగుదలకు, కలుపు నివారణకు ఎకరానికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి పెట్టుబడి లేకుండా నాలుగు సంవత్సరాలకు మొదటి కటింగ్ వచ్చింది.
మొదటి కటింగ్‌లో ఎకరానికి 30నుంచి 35 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు 40నుంచి 45టన్నుల దిగుబడి వస్తుందని వెంకటయ్య చెప్పాడు. మార్కెట్లో పేపర్‌కు మంచి డిమాండ్ ఉండడంతో టన్ను ధర 2వేల నుంచి రూ.2500 వరకు పలుకుతుందన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో సుబాబుల్ కొనుగోలు చేసే సంస్థలు కాగజ్‌నగర్, భద్రాచలం, కమలాపూర్, హూజూర్‌నగర్ ఏరియాల్లో ఉన్నాయి. ఐటీసీ రా మెటీరియల్ కాంట్రాక్టర్ నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నాడు.
ఇతర పంటలతో ఆదాయం అంతంతమాత్రమే..
నాకు 8ఎకరాల భూమి ఉంది. గతంలో వివిధ రకాల పంటలు సాగు చేశాను. పెట్టుబడి పోను అంతంతమాత్రమే మిగిలేది. నాకు తెలిసిన ఒక రైతు సుబాబుల్ సాగు గురించి చెప్తే ఆరు సంవత్సరాల క్రితం భద్రాచలం వెళ్లి సుబాబుల్ గింజలు తెచ్చి మూడు ఎకరాల్లో నాటించా. అయితే.. కొంత భూమి సారవంతమైనది కాకపోవడంతో మొదటి కటింగ్ 4సంవత్సరాలకు వచ్చింది. ఇది రెండో కటింగ్. మూడెకరాలకు ఖర్చులు పోను రూ.1.70లక్షల వరకు వస్తుంది.
– తుడుం వెంకటయ్య, రైతు, బసిరెడ్డిపల్లి
సుబాబుల్ ఆదాయాన్నిచ్చే వనరు
సుబాబుల్ సాగు రైతులకు మంచి ఆదాయన్నిచ్చే వనరు. ఈ సాగు చేయాలనుకున్న రైతులకు మేము గింజలు, మొక్కలను ఉచితంగా ఇస్తాం. జమాయిల్ మొక్కలకు ఒక్కోటి మూడు రూపాయలు పడుతుంది. కర్ర కోత దశకు రాగానే మాకు సమాచారం ఇస్తే నేరుగా వచ్చి రైతులకు ఎలాంటి ఖర్చులు లేకుండా కూలీల ద్వారా కటింగ్ చేసుకుంటాం. కాంటా అయిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ఇప్పుడు మన రాష్ట్రంలో సుబాబుల్‌కు మంచి డిమాండ్ ఉంది. టన్నుకు రూ.2500 వరకు ధర పలుకుతుంది.
– తిరుపతయ్య, ఐటీసీ రా మెటీరియల్ కాంట్రక్టర్