– తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి
చండూరు, మే 21 : నల్లగొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. చండూరులో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు వల్ల ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అవుతాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు, నేరాలు జరిగినప్పుడు ఉన్నత స్థాయి పోలీసు అధికారి నేరుగా పర్యవేక్షించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటుందని తెలిపారు. అలాగే ప్రజలు తమ ఫిర్యాదులు లేదా సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా కేంద్రానికి వెళ్లకుండా, స్థానిక డివిజన్ కేంద్రంలోనే డీఎస్పీని సంప్రదించే అవకాశం లభిస్తుందన్నారు. ఎలాంటి సమస్యలైనా త్వరితగతిన పరిష్కారానికి ఆవశ్యకత ఉంటుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ కేంద్రంలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.