త్రిపురారం, జనవరి 3 : మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగడంతో వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించాలని, మిథేన్ కాలుష్య కారకం నివారణకు తడి-పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్త్రవేత్త సూచిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదకత సాధించే తడి-పొడి విధానం అమలు పద్ధతిపై కృషి విజ్ఞాన కేంద్రం కంపసాగర్ సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ భరత్ పలు సూచనలు చేశారు. ఆయన మాటల్లోనే..
తడి-పొడి పద్ధతిలో రంధ్రాలున్న ప్లాస్టిక్ గొట్టాన్ని ఉపయోగించి పొలంలో ఉన్న నీటి మోతాదును గుర్తించి అవసరమైన నీటిని ఇవ్వాలి. దీని కోసం రైతులు ముందుగా అడుగు పొడవు 6 అంగుళాల వ్యాసం ఉండే గొట్టాన్ని తీసుకోవాలి. గొట్టం అడుగుభాగం నుంచి సగం ఎత్తు వరకు చుట్టూ రంధ్రాలు 0.5 సెంటిమీటర్ల పరిమాణంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. రెండు రంధ్రాల మధ్య 2 సెంటిమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని అరడుగు లోతు వరకు భూమి లోపలికి దించుకోవాలి. గొట్టం లోపల మట్టిని తీసివేయాలి. గొట్టం రంధ్రాల గుండా నీరు లోపలికి ప్రవహించి ఇలా అమర్చిన గొట్టం నీటిమట్టాన్ని సూచిస్తుంది. ఈ గొట్టాన్ని పొలంలో గట్లకు దగ్గరగా అమర్చుకోవడం వల్ల ప్రతి రోజు చూసుకోవడానికి సులువుగా ఉంటుంది.
నాటు వేసిన 1-2 వారాల తర్వాత…
వరి నాటు వేసిన తర్వాత సుమారు 1 నుంచి 2 వారాల తర్వాత తడి-పొడి పద్ధతి పాటించాలి. కలుపు ఎక్కువగా ఉంటే దాని నివారణ తర్వాత పాటించాలి. పొలంలో 5 సెంటిమీటర్లపైకి వచ్చే విధంగా తడిని పెట్టాలి. తర్వాత క్రమంగా నీటిమట్టం తగ్గుతూ ఉంటుంది. అనంతరం పొలం వెంట్రుక మందం చీలిపోయినట్లు కనిపించిన వె ంటనే మళ్లీ తడి ఇవ్వాలి. అయితే పంటపూత దశలో నీరు 5 సెంటిమీటర్ల వరకు నీరు నిలబడేలా చూసుకోవాలి. పూత దశ తర్వాత వరి గింజలు పాలు పోసుకునే దశలో, అలాగే కోతకు ముందు నీరు భూమి లోపల 5 సెంటీ మీటర్లకు వెళ్లే వరకు తిరిగి నీటిని పెట్టాల్సిన అవసరం లేదు.
పాటించాల్సిన జాగ్రత్తలు
l చౌడు నేలల్లో తడి-పొడి విధానం పాటించకూడదు.
l నీటిగొట్టం అమర్చేటప్పుడు నాగటి సాలు కింద గట్టి పొర పాడవకుండా జాగ్రత్తగా అమర్చుకోవాలి.
l నీటి గొట్టంలోని మట్టిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
l వరి పంట కంకి ఏర్పడే సమయంలో 10 రోజుల వరకు సాధారణ పద్ధతిలాగానే నీటిని పెట్టుకోవాలి.
లాభాలు
l మిథేన్ కాలుష్య కారకం విడుదల తగ్గుతుంది.
l హైడ్రోజన్ సర్ఫైడ్ వల్ల వరి పంటకు హాని కలుగకుండా ఉంటుంది.
l 15 నుంచి 30 శాతం నీటి వినియోగం తగ్గడంతో పాటు, పంట వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది చీడపీడలు, దోమ ఉధృతిని తట్టుకుంటుంది.
l చేను భూమిపై పడకుండా ఉంటుంది.
l నేల భౌతిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా యంత్రాలతో కోతకు అనుకూల పరిస్థితులుంటాయి. l మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులు ఉపయోగించడం వల్ల గ్రీన్హౌస్ మార్కెట్లో ఆదాయం వస్తుంది.