సూర్యాపేట టౌన్, నవంబర్ 15 : సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓగా డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. పొగాకు, మత్తు పదార్దాల రహిత సమాజ నిర్మాణం కోసం అందరిని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తూ మహిళలకు సంభవించే కాన్సర్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా చిన్నారులకు ఇమ్యూనైజేషన్ టీకాలను అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే విధంగా వైద్య శాఖ పనిచేస్తుందన్నారు.
35 సంవత్సరాలు పై బడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించి ఉచిత మందుల పంపిణీతో పాటు వైద్య పరమైన సలహాలు ఇస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలను పర్యవేక్షిస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయడంతో పాటు విధుల పట్ల అలసత్వం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లాలోని పలువురు వైద్యాధికారులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతించి అభినందనలు తెలిపారు.