సూర్యాపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు మంచి నీటికి తండ్లాడిన పల్లెలు నేడు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథలో భాగంగా అన్ని గ్రామాల మాదిరిగానే తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారంలోనూ ఇంటింటికీ నల్లా నీళ్లు అందుతున్నాయి. ఇది నిన్నో, మొన్నో వచ్చిన మార్పు కాదు. 2018 నుంచి ఈ ఊరు భగీరథ ఫలాన్ని పొందుతున్నది. ప్రభుత్వం పాలేరు రిజర్వాయర్ నుంచి చిల్పకుంట్ల ప్లాంట్‌కు కృషా ్ణ జలాలను తీసుకొచ్చి, అక్కడ శుద్ధి చేసి మడమటితండా ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేసి గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తున్నది. ఈ విషయంలో ఊరుఊరంతా సంతోషంగా ఉన్నది. ఇదిలా ఉంటే, వాస్తవాలు చూడలేని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వగ్రామం నాగారానికే భగీరథ జలాలు రావడం లేదనడం విడ్డూరం. తన వ్యాఖ్య అవాస్తవమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కోమటిరెడ్డి.. తమ గ్రామానికి వచ్చి భగీరథ నీటిని చూసి రాజకీయాలను వదిలిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటితో దాహార్తి తీర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారు. ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి విజయవంతంగా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు భగీరథ నీళ్లు అందుతున్నాయి. ఈ పథకం తొలి ఫలితం తుంగతుర్తి నియోజకవర్గానికే దక్కడం గమనార్హం. జాతీయ రహదారికి దక్షిణం వైపు ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గంలోని కొంతభాగంతోపాటు హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తానికి నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి భగీరథ అందుతున్నాయి. జాతీయ రహదారికి మరోవైపు ఉన్న సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాలకు ఖమ్మం జిల్లా పాలేరుతోపాటు జనగాం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే మెట్రో వాటర్ వర్క్(హెచ్ఎండబ్ల్యూసీ) పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వీటిలో సూర్యాపేట కొత్త కలెక్టరేట్ భవన శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడుతగా చివ్వెంల మండలం చందుపట్ల వద్ద 58 గ్రామాలకు నీటిని విడుదలను ప్రారంభించారు. అలాగే జనగాం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే మెట్రో వాటర్ వర్క్ పైపుల ద్వారా పలు గ్రామాలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నీటి విడుదలను షురూ చేశారు.
తాజాగా రూ.కోటిన్నరతో కొత్త మోటర్లు
చిల్పకుంట్లలో గతంలో ఉన్న పాత మోటర్లు తరుచూ మరమ్మతులకు గురవుతుండడంతో సుమారు రూ.కోటిన్నర వ్యయంతో కొత్త మోటర్లు బిగిస్తున్నారు. వారం రోజుల క్రితం మిషన్ భగరథ అధికారులు నీటి ఇబ్బందులు ఉంటాయని ముందస్తుగానే ప్రకటించి మోటర్ల బిగింపు పనులు చేపట్టారు. పనులు పూర్తికాగా నేడు లేదా రేపు మోటర్లు ఆన్ చేసే అవకాశం ఉన్నది. ఈ వారంపాటు పంచాయతీ బోర్ల ద్వారా ట్యాంకులు నింపి నీటిని సరఫరా చేస్తున్నారు. చిల్పకుంట్ల మోటర్లు ఆన్ అయితే యథావిధిగా భగీరథ నీళ్లు సరఫరా కానున్నాయని అధికారులు తెలిపారు.
ఇంటింటికీ పుష్కలంగా నీరు
సూర్యాపేట జిల్లా మొత్తానికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన జలాలు అందుతుండగా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వగ్రామమైన నాగారానికి భగీరథ నీళ్లు రావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా ఆ నీళ్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిన విషయం విదితమే. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే పాలేరు మంచినీటి పథకం ద్వారా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాలకు నీటిని అందిస్తున్నారు.
గతంలో పాలేరు మంచినీటి పథకం ద్వారా కేవలం మోతె మండలానికి మనిషికి 40లీటర్ల నీటినే ఇవ్వగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరికి 100 లీటర్లు కచ్చితంగా ఇచ్చేలా మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించారు. దాంతో పాలేరు మంచినీటి పథకాన్ని ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలకే కుదించి మిగిలిన గ్రామాల కోసం సుమారు రూ.80కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు పూర్తి చేయడంతో పుష్కలంగా స్వచ్ఛమైన నీరు అందుతున్నది. స్థానిక ఎమ్మెల్యే కిశోర్ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేసి పలు సూచనలు కూడా చేస్తుండడంతో నాలుగేండ్లుగా నియోజకవర్గంలో ఏ సమస్యా తలెత్తడం లేదు.
చిల్పకుంట్ల నుంచి నాగారానికి..
పాలేరులో ఉన్న ఒక బావిని విస్తరించి అక్కడి నుంచి పంపింగ్ ద్వారా నూతనకల్ మండలం చిల్పకుంట్లకు రా వాటర్ పంపిస్తున్నారు. చిల్పకుంట్లలో ప్యూరిఫై చేసిన వాటర్‌ను పడమటి తండా ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా పంపింగ్ చేసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నాగారానికి సరఫరా చేస్తున్నారు. 2018 సంవత్సరం నుంచి భగీరథ పథకం ద్వారా నాగారానికి నీళ్లు వస్తుండడంతో గ్రామస్తుల సంతోషంగా ఉంటున్నారు.
2018 నుంచి భగీరథ జలాలు అందిస్తున్నాం
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో మెజారిటీ గ్రామాలకు 2018 నుంచి పాలేరు ద్వారా భగీరథ జలాలు అందిస్తున్నాం. అందులో భాగంగా నాగారం గ్రామానికి కూడా భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నాం. గత వారం రోజులుగా మోటర్ల రీప్లేస్మెంట్ పనులు జరుగుతున్నాయి. నీటి ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా పంచాయతీ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నేడో రేపో మోటర్లు ఆన్ అవుతాయి. మళ్లీ అన్ని గ్రామాలకు నిరాటంకంగా భగీరథ నీళ్లు అందుతాయి.
–వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ, సూర్యాపేట
నీళ్ల కష్టాలు లేవు
గతంలో వ్యవసాయ బావులు, బోర్ల కాడికి పోయి నీళ్లు తెచ్చుకునేది. ఇంట్లో మనిషికి ఒకరు బిందె తీసుకుని వరాల వెంబడి పోయి తీసుకొచ్చేది. నీళ్లంటనే నాడు కన్నీళ్లు వచ్చేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ల బాధలు పోయినయి. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సార్లు మా ఊర్లో ట్యాంక్ కట్టించి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారు. నీళ్ల ఇబ్బందులైతే లేవు. కరెంట్ సమస్య కూడా లేదు.
–షేక్ మాలోన్బీ, నాగారం
ఇంట్లకే నీళ్లొస్తున్నయి
కేసీఆర్ సర్ వచ్చినంకనే మాకిన్ని మంచినీళ్లు దొరుకుతున్నయి. ఊళ్లోకి రోజూ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయి. అంతకుముందు బోరింగ్ దగ్గరకు పోయి బిందెలు వరుసలో పెట్టి గంటల తరబడి నిలబడేది. శిలుముతో వచ్చే నీళ్లే అయినా, ఒక్క బిందె రెండ్రోజులు సరిపెట్టుకునేది. ఇప్పుడు ఆ బాధలు లేవు. ఇంట్లకే నీళ్లొస్తున్నయి.
–గంట లక్ష్మి, నాగారం