నిడమనూరు, నవంబర్ 12 : సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మరోమారు అవగాహన కల్పించి సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిడమనూరు మండలంలోని నిడమనూరు, వల్లభాపురం, తుమ్మడం, రాజన్నగూడెం గ్రామాల్లో సర్వే తీరును మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వల్లభాపురం, తుమ్మడం గ్రామాల్లో సర్వే నెమ్మదిగా సాగుతుండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తుమ్మడంలో 3 రోజుల్లో 30 ఇండ్లు మాత్రమే సర్వే చేయడం పట్ల సూపర్వైజర్ శ్రీనివాస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆయనను మార్చి పారితోషికాన్ని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
రాజన్నగూడెంలో కుటుంబ యజమానుల నుంచి వివరాలను సేకరించడంలో ఇబ్బందులు పడుతున్న ఎన్యుమరేటర్ గంగరాజు పరిస్థితిని గమనించి మరోమారు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే సందర్భంగా ఇండ్లలో ఎవరైనా లేనట్లయితే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సర్వేలో వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఊట్కూరు లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి, తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, ఎంపీడీఓ జి. వెంకటేశం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా ఏఈలు సాయి ప్రసాద్, వెంకన్న, ఏఓ మునికృష్ణయ్య, ఎంఈఓ లావూరి వెంకన్న తదితరులున్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
హాలియా : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మహేంద్ర చింట్లు సన్నరకం ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని రైతులు కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ మంగళవారం హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం రాశులను ఆమె పరిశీలించారు. ఐకేపీ సిబ్బందితోపాటు రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 68 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంకొనుగోలు చేశామని, రూ.20 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో అదనపు గోదాములు నిర్మించాలని మార్కెట్ చైర్మన్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హాలియా 6వ వార్డులో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను ఆమె పరిశీలించారు. ఆమె వెంట డీఎస్ఓ వెంకటేశ్వర్లు, మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మిల్లర్స్ చిట్టిపోలు యాదగిరి, తాసీల్దార్ రఘు, ఏఓ సరిత, సీఈఓ సత్యం, ఎంపీడీఓ సుజాత, నాయకులు కాకునూరి నారాయణ, నాగిరెడ్డి మార్కెట్ సిబ్బంది తదితరులున్నారు.